
రాజాపేట, జూన్ 11 : రాజాపేట మండల కేంద్రానికి చెందిన యువ క్రికెటర్ ఊట్కూరు యశ్వీర్ గౌడ్ భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఊట్కూరు రాజ్‌కుమార్, వాణి దంపతుల కుమారుడైన యశ్వీర్ గౌడ్ తన ప్రతిభతో
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం రాజాపేటకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చింది. గురువారం బీసీసీఏ నిర్వహించిన ఎంపికల ప్రక్రియలో దేశ వ్యాప్తంగా వేలాది మంది యువ క్రికెటర్లు పోటీపడగా, తన అద్భుత ప్రతిభతో యశ్వీర్ గౌడ్ భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన క్రీడాకారుల్లో యశ్వీర్ గౌడ్ ఒకరు కావడం విశేషంగా నిలిచింది.
ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యశ్వీర్ గౌడ్ చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుని క్రమశిక్షణతో సాధన కొనసాగించాడు. అతని కృషి, పట్టుదల, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఫలితంగానే ఈ అరుదైన అవకాశం దక్కిందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యశ్వీర్ కుటుంబ సభ్యులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నివాసం ఉంటున్నప్పటికీ, వారి స్వగ్రామమైన రాజాపేటతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో శ్రీలంకలో జరగనున్న అండర్-19 క్రికెట్ పోటీల్లో భారత జట్టు తరఫున యశ్వీర్ గౌడ్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా రాజాపేట మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు యశ్వీర్ గౌడ్‌ను అభినందిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి, తెలంగాణకు, రాజాపేటకు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువ క్రీడాకారులకు యశ్వీర్ గౌడ్ ఆదర్శంగా నిలుస్తున్నాడని, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభకు అవకాశాలు లభిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన విజయం మరోసారి నిరూపించిందని పలువురు పేర్కొన్నారు. రాజాపేట గడ్డపై పుట్టిన యువకుడు భారత జట్టులో స్థానం సంపాదించడం మండల చరిత్రలో ఒక మధుర ఘట్టంగా నిలిచిపోతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.