
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ లైఫ్ జర్నీ గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆమె లైఫ్ టర్న్ తీసుకున్న విధానం, సెకండ్ మ్యారేజ్, డివోర్స్.. వీటన్నింటితో ఆమె పబ్లిక్‌లో ఎక్కువగా కనిపించేవారు కాదు
.
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ (Sreeja Konidela) లైఫ్ జర్నీ గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆమె లైఫ్ టర్న్ తీసుకున్న విధానం, సెకండ్ మ్యారేజ్, డివోర్స్.. వీటన్నింటితో ఆమె పబ్లిక్‌లో ఎక్కువగా కనిపించేవారు కాదు. కానీ, ఫస్ట్ టైమ్ ఆమె సోషల్ మీడియా వేదికగా తన మనసులోని ఎన్నో భావాలను షేర్ చేసుకున్నారు. ‘జీవితం అనేది మనకు తెలియకుండా ఊరికే జరిగిపోదని, మన జీవితాన్ని మనమే సృష్టించుకునే శక్తి మనకు ఉందని అర్థం చేసుకున్నా’ అంటూ తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ..
‘‘నా పేరు శ్రీజ. ‘ది సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్’ (The Self Mastery Project)లో పాల్గొన్న నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఇందులో 15 నెలల ప్రోగ్రామ్‌ను పూర్తి చేశాను. నిజం చెప్పాలంటే, నేను మొదట 15 నెలలు అనగానే భయపడ్డాను. అంత సమయాన్ని నేను ఎలా కేటాయించగలను, నేను ఇందులో స్థిరంగా కొనసాగగలనా అని ఆలోచించాను. కానీ, ఈ ప్రోగ్రామ్‌లోకి వెళ్లిన కొద్ది రోజులకే నాకు ఒక విషయం అర్థమైంది. ఈ ప్రోగ్రామ్‌ను మన జీవనశైలికి సులభంగా అలవడేలా రూపకల్పన చేశారు. ఇది కేవలం మనకు కొన్ని టూల్స్ నేర్పించి వదిలేసే ప్రోగ్రామ్ కాదు.. ఇది పూర్తిగా ఒక అనుభవపూర్వకమైన ప్రయాణం. మనం నేర్చుకున్న వాటిని ప్రయోగించి చూడటానికి, అనుభవించడానికి, వాటితో జీవించడానికి ఇక్కడ ఎంతో సపోర్ట్ లభిస్తుంది. అలాగే, మనకు ఏదైనా సవాలు ఎదురైనప్పుడు.. మళ్లీ ఇక్కడికి వచ్చి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి, తిరిగి నేర్చుకోవడానికి, మనల్ని మనం మరింత మెరుగుపరుచుకోవడానికి ఒక చక్కటి స్పేస్ దొరుకుతుంది.
ఈ అద్భుతమైన స్పేస్‌ను నడిపిస్తున్నది నా టీచర్, నా గురువు, నా గైడ్, నా హీలర్ అయిన శ్రీమతి ఉష అనురాధ. ఆమె నాలెడ్జ్, వివేకం చాలా గొప్పవి. వాటన్నింటినీ ఆమె చుట్టూ ఉన్నవారితో ఎంతో ఉదారంగా పంచుకుంటారు. ఇంకా ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే.. ఇది ఎంతో ఆధ్యాత్మికమైనది. విశ్వం యొక్క మెటాఫిజికల్ నియమాలపై రూపొందించబడింది. అయినప్పటికీ, దీనిని ఎవరైనా సులభంగా అర్థం చేసుకునేలా చాలా సరళంగా బోధిస్తారు. మన మనస్సులోని ఆలోచనలను సరిగ్గా అర్థం చేసుకుంటూ.. బయటి ప్రపంచంతో సమర్థవంతంగా ఎలా మెలగాలనే దానికి సంబంధించిన ఆధునిక టూల్స్‌ను కూడా ఇది అందిస్తుంది. తద్వారా ఈ జీవితంలో ఒక మంచి మానవీయ అనుభవాన్ని సృష్టించుకోవడానికి ఇది తోడ్పడుతుంది.
చివరగా నాకు అర్థమైంది ఏంటంటే.. మనపై మనం ఇన్వెస్ట్ చేసుకోవాలనే ఆ ఒక్క సంకల్పం, అలాగే ఈ ప్రక్రియను పూర్తిగా నమ్మి దానికి లొంగిపోవడం మాత్రమే దీనికి కావాలి. ఆ కోణంలో చూసినప్పుడు.. జీవితకాలం పాటు మనతో ఉండే ఇంతటి విలువైన మార్పు కోసం ఈ 15 నెలలు అనేది చాలా చిన్న సమయంగా అనిపిస్తుంది. నేను ఈ ప్రోగ్రామ్‌లో చేరిన కొత్తలో.. నాకేమీ అర్థంకాక పూర్తిగా అయోమయంలో ఉండేదాన్ని. ‘ఇదంతా నాకే ఎందుకు జరుగుతోంది? నేను ఇంత బాధను ఎందుకు అనుభవిస్తున్నాను? ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష?’ అనే ఆలోచనల్లోనే ఉండిపోయాను. కానీ ఈ ప్రయాణంలో నాలో ఒక లోతైన మార్పు వచ్చింది. ‘నేనొక బాధితురాలిని’ అనే భావన నుంచి బయటపడ్డాను. జీవితం అనేది మనకు తెలియకుండా ఊరికే జరిగిపోదని, మన జీవితాన్ని మనమే సృష్టించుకునే శక్తి మనకు ఉందని అర్థం చేసుకున్నా. ఆ చిన్న మార్పు నా ఆలోచనల్లో ఎంతో స్పష్టతను తీసుకువచ్చింది.
ఈ ప్రోగ్రామ్ ద్వారా నాలో వచ్చిన మరో పెద్ద మార్పు ఏంటంటే.. అసలు ‘నేను ఎవరు?’ అని నన్ను నేను తెలుసుకోవడం. నా జీవితంలో ఎక్కువ భాగం నా బాధలు, నా గతం, నా కష్టాలే నేనని అనుకున్నాను. నా జీవితంలో జరిగిన ప్రతి చేదు అనుభవం ఆధారంగానే నా గుర్తింపు ఏర్పడింది. కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా, వాటన్నింటికీ మించి నాలో ఇంకా ఏదో ఉందనే విషయాన్ని చూడటం మొదలుపెట్టాను. అవును, బాధ అనేది నా జీవితంలో ఒక భాగమే కావచ్చు, కానీ అదే నా జీవితం కాదు. ఒక మనిషిగా నాలో తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఆ పొరలను విప్పుకుంటూ నన్ను నేను ఆవిష్కరించుకోవడం ఈ ప్రయాణంలో అత్యంత అందమైన అనుభవం. నా జీవితాన్ని నిజంగా మార్చేసిన శ్రీమతి ఉష అనురాధకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ప్రతి విషయాన్నీ ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లిన ‘సేక్రెడ్ పాత్స్’ టీమ్ మొత్తానికి థ్యాంక్స్’’ అని శ్రీజ ఇందులో చెప్పుకొచ్చారు.
బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్‌కు ఫిదా!
Thank you Subbarao: పాతికేళ్ళ తర్వాత అదే టైటిల్‌తో...