తాను మమతా బెనర్జీ వెంటే ఉంటానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బాలీవుడ్ షాట్‌గన్ శత్రఘ్న సిన్హా స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలినప్పుడు దీదీ తనకు అండగా నిలిచారని, అందుకే ఈ క్లిష్ట సమయంలో ఆమెను
విడిచిపెట్టేదిలేదని మమతా పట్ల తన విధేయతను సిన్హా చాటుకున్నారు. పార్లమెంటులో ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్న 19 మంది తిరుగుబాటు టీఎంసీ ఎంపీల జాబితాలో ఆయన పేరు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.‘‘2019లో పాట్నా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, చాలా తక్కువ మంది నాకు అండగా నిలిచారు. నాకు మద్దతునిచ్చి, ప్రోత్సహించిన కొద్దిమందిలో మమతా బెనర్జీ ఒకరు.. నా పార్లమెంటరీ ప్రయాణంలో ఎలాంటి విరామం లేకుండా నేను ప్రజా జీవితంలో కొనసాగాలని ఆమె విశ్వసించారు. ఆమె ఆదేశం మేరకే నేను అసన్సోల్ నుంచి పోటీ చేశాను. దైవ కృపతో, మమతాజీ, అసన్సోల్ ప్రజల మద్దతుతో నేను విజయం సాధించాను. గత కొన్ని రోజులుగా నా గురించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు నిజం చెబుతుంటే, మరికొందరు వదంతులు వ్యాపింపజేస్తున్నారు’’ అని సిన్హా పేర్కొన్నారు. రెబల్ శిబిరంలోకి తనను ఆహ్వానించిన వారికి కృతజ్ఞుడనని సిన్హా తెలిపారు. అయితే, మమతాతో నిలబడటమే తన సూత్రప్రాయమైన వైఖరి అని ఆయన స్పష్టం చేశారు. కొందరు తాను రెబల్ గ్రూప్‌లో చేరుతానని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘అవును నేను ముక్కుసూటిగా మాట్లాడుతాను.. నా స్వభావం అంత.. నిజం చెప్పడాన్ని తిరుగుబాటు అనుకుంటే నేను కూడా ఒక తిరుగుబాటుదారుడ్... నేను ఎప్పుడూ నిక్కచ్చిగా మాట్లాడి, ఉన్నది ఉన్నట్లుగా చెబుతాను.. కానీ నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నదేంటంటే నా కష్టకాలంలో మమతాజీ నాకు అండగా నిలిచారు, ఈ రోజు ఆమె కష్ట దశలో నేను ఆమెను విడిచిపెట్టలేను’’ అని ఆయన అన్నారు.‘‘దేవుడి ఆశీస్సులతో ఒకసారి కాదు నేను రెండుసార్లు తృణమూల్ కాంగ్రెస్ గుర్తుపై ఎన్నికయ్యాను.. కాబట్టి మమతాజీకి, తృణమూల్ కాంగ్రెస్‌కు అండగా నిలబడటం నా కర్తవ్యం, బాధ్యత... నా సిద్ధాంతం చాలా స్పష్టం నా కష్టకాలంలో దీదీ నాకు అండగా నిలబడినప్పుడు.. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఆమెకు నేను కూడా అండగా నిలబడటం నా కర్తవ్యం’’ అని సిన్హా పునరుద్ఘాటించారు.పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘోర ఓటమితో మమతా బెనర్జీ పార్టీలో అసమ్మతి రేగుతోంది. అసెంబ్లీలో ఆ పార్టీ చీలిపోగా.. ఇప్పుడు పార్లమెంటులో కూడా చీలిక ముప్పును ఎదుర్కొంటోంది. టీఎంసీ ఎంపీలలో ఎక్కువ మంది మమతా బెనర్జీతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని రెబల్ వర్గానికి నాయకత్వం వహిస్తోన్న కాకోలీ ఘోష్ దస్తిదార్ పేర్కొన్నారు.