
ఇంటర్నెట్ డెస్క్: ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఎన్నికైన ప్రధానుల్లో నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా మోదీ (PM Narendra Modi) రికార్డు సృష్టించారు. దీనిపై ప్రతిపక్ష
కాంగ్రెస్ (Congress) స్పందిస్తూ మోదీపై విమర్శలు గుప్పించింది. ఆయన స్వయంప్రకటిత మైలురాయిని దాటారేమో కానీ, దేశానికి పెద్ద సమస్యగా పరిణమించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. మోదీ పాలనకు కాకుండా దేశంలో ప్రజాస్వామ్య హత్యకు సారథ్యం వహిస్తున్నారని అన్నారు.
1947 ఆగస్టు 15న జవహర్లాల్ నెహ్రూ (Nehru) ఒక అద్భుతమైన మంత్రివర్గానికి అధ్యక్షత వహించి.. భారత ప్రధాని అయ్యారని జైరాం రమేశ్ (Jairam Ramesh) పేర్కొన్నారు. ప్రపంచంలోనే అరుదైన ఆ మంత్రివర్గం పాలనలో ఐదేళ్లలోనే ఆధునిక భారతం ఆవిర్భవించిందన్నారు. 560కి పైగా రాచరిక రాష్ట్రాలను శాంతియుతంగా భారత యూనియన్లో విలీనం చేశారని.. భారత రాజ్యాంగాన్ని ఆమోదించారని అన్నారు. దేశంలోని జమీందారీ వ్యవస్థ రద్దు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు, నీటిపారుదల ప్రాజెక్ట్లు వంటి నిర్ణయాలతో దేశం ప్రపంచ వ్యవహారాల్లో ఒక శక్తిగా ఆవిర్భవించిందన్నారు. 1947-52 మధ్య నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు దేశం నెలకొల్పిన రికార్డులను మోదీ చరిత్ర నుంచి చెరిపేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
1952, 1957, 1962 ఎన్నికల్లో నెహ్రూ భారీ మెజారిటీతో విజయం సాధించగా.. 2024లో మోదీకి కనీస మెజారిటీ కూడా రాలేదని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. ప్రధాని కావడానికి ఎన్డీఏ నేతలకు తాయిళాలు ఇచ్చి మద్దతు కూడగట్టుకోవాల్సి వచ్చిందన్నారు. మోదీ పరిపాలనలో స్వతంత్ర ఎన్నికల సంఘం, పవిత్రమైన ఓటర్ల జాబితా వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు ముప్పులో పడ్డాయన్నారు. పేపర్ లీక్ల కుంభకోణాలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రైవేటీకరణ పేరుతో ఎన్నో ప్రభుత్వ ఆస్తులను కొందరు ధనవంతుల పరం చేస్తున్నారని దుయ్యబట్టారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు ఇతర వెనకబడిన తరగతులకు (OBC) కల్పించిన రిజర్వేషన్లను బలహీనపరుస్తున్నారని విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.