జూన్ 10.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక పండగలాంటి రోజు. బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని తన ఊరమాస్ డైలాగులు, గర్జించే నటనతో శాసించే 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ జన్మదినం. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి
తారక రామారావు వారసుడిగా వెండితెరకు పరిచయమైనా తనదైన స్వయంకృషితో, న భూతో న భవిష్యతి అనే రేంజులో మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు బాలయ్య. యాభై ఏళ్లకు పైగా సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను దాటి, ఇటీవల భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును సైతం అందుకున్న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం. బాక్సాఫీస్ సింహం.. తిరుగులేని మాస్ క్రేజ్!తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'మాస్' అనే పదానికి నిలువెత్తు రూపం బాలకృష్ణ. ఆయన సినిమా థియేటర్లోకి వస్తుందంటే అభిమానులకు పూనకాలే. 'సమరసింహా రెడ్డి', 'నరసింహనాయుడు' చిత్రాలతో తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలకు సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన బాలయ్య.. డైలాగ్ డెలివరీలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఆయన బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. కరోనా తర్వాత 'అఖండ' చిత్రంతో టాలీవుడ్‌కు ఊపిరిలూదిన బాలయ్య ఆ తర్వాత 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టి, మొన్నటి 'డాకు మహారాజ్', ‘అఖండ 2’ వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అరవై ఏళ్ళు దాటినా కుర్ర హీరోలకు పోటీగా ఆయన చూపిస్తున్న ఎనర్జీ, బాక్సాఫీస్ స్టామినా చూసి ఇండస్ట్రీ సైతం ముక్కున వేలేసుకుంటుంది. 'బాలయ్య ఈజ్ లైక్ ఓల్డ్ వైన్.. వయసు పెరిగేకొద్దీ ఆయన క్రేజ్, పవర్ మరింత పెరుగుతూనే ఉన్నాయి'.* నందమూరి బాలకృష్ణ బర్త్‌డే స్పెషల్... ‘భోళా బాలయ్య’ సిగ్నేచర్ సాంగ్ లాంచ్భోలా బాలయ్యసినీ తెరపై సింహంలా గర్జించే బాలకృష్ణ నిజజీవితంలో మాత్రం కల్మషం లేని ఒక చిన్న పిల్లాడులా ప్రవర్తిస్తుంటారు. ఆయన మనసు తెల్లకాగితంలా స్వచ్ఛంగా ఉంటుందని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. కోపమొస్తే అక్కడికక్కడే ప్రదర్శిస్తారు, ప్రేముంటే ప్రాణమిస్తారు. మనసులో ఒకటి పెట్టుకుని, బయటకు ఇంకోలా మాట్లాడటం బాలయ్య డిక్షనరీలోనే లేదు. అందుకే ఆయన్ని అందరూ 'భోలా బాలయ్య' అని పిలుచుకుంటారు. 'అన్‌స్టాపబుల్' టాక్ షో ద్వారా ఆయనలోని ఈ హుషారైన, మనసుకు హత్తుకునే సరికొత్త కోణాన్ని ప్రపంచం చూసింది. ఈ షోతో ఆయన క్రేజ్ యువతలో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఊహించని స్థాయికి చేరింది.నటుడిగా.. ప్రజానాయకుడిగా..బాలకృష్ణ కేవలం వెండితెరకే పరిమితం కాలేదు. అటు అద్భుతమైన నటుడిగా రాణిస్తూనే, ఇటు ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం నుండి వరుసగా మూడోసారి శాసనసభకు ఎన్నికై రాజకీయాల్లోనూ తన తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తున్నారు. షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా, తన నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం సమయం కేటాయించడం ఆయన బాధ్యతాయుతమైన రాజకీయ నాయకత్వానికి నిదర్శనం.ప్రాణం పోసే సేవా గుణంబాలయ్యలోని అసలైన మానవతావాది, సేవాతత్పరుడు మనకు 'బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్' ద్వారా కనిపిస్తారు. తన తల్లి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రికి బాలకృష్ణ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ కేవలం ఒక హోదా కోసమే కాకుండా బాధ్యతగా ప్రతి విషయాన్ని పర్యవేక్షిస్తారు. పేద ప్రజలకు, ముఖ్యంగా రూపాయి ఖర్చు పెట్టుకోలేని క్యాన్సర్ రోగులకు ఈ ఆస్పత్రి ఒక దేవాలయం లాంటిది. వేలాది మందికి ఇక్కడ ఉచితంగా, రాయితీలతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతోంది. కేవలం సినిమాల్లోనే కాకుండా, నిజ జీవితంలోనూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు బాలయ్య బాబు. ఈ ఆస్పత్రి ద్వారా ఆయన చేస్తున్న నిరంతర సేవలు ఎందరికో ఆదర్శం. బాలయ్య అందరివాడుచిత్ర పరిశ్రమలో బాలకృష్ణ అంటే అందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవం, ఇష్టం. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సమకాలీన స్టార్ హీరోల నుండి నేటి తరం యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరితో ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఇండస్ట్రీలో ఎవరికైనా ఏ కష్టమొచ్చినా, ఏ వేడుక జరిగినా బాలయ్య ముందుంటారు. "బాలకృష్ణ ఎనర్జీని మ్యాచ్ చేయడం ఎవరికైనా సాధ్యం కాదు. ఆయన సెట్లోకి వస్తే వచ్చే వైబ్రేషన్స్, పాజిటివిటీ అద్భుతం" అని తోటి నటులు తరచూ చెబుతుంటారు. ఆయన క్రమశిక్షణ, సమయపాలన, సీనియర్-జూనియర్ అనే తేడా లేకుండా అందరినీ సమానంగా ఆదరించే గుణమే బాలయ్యని అందరివాడిని చేసింది. అన్‌స్టాపబుల్ ఎనర్జీ!యాక్షన్ సీక్వెన్స్ అయినా, భారీ డైలాగ్స్ అయినా, ఊరమాస్ స్టెప్పులైనా.. బాలయ్య రంగంలోకి దిగితే పూనకాలు గ్యారంటీ. ఈ వయసులో కూడా ఆయన స్టేజ్ ఫర్ఫార్మెన్స్ చూస్తే యువ హీరోలు సైతం కుళ్లుకోవాల్సిందే. వెండితెరపై ఆయన నటనలో కనిపించే ఆ రౌద్రం, ఆ గంభీరత్వం ట్రేడ్‌మార్క్‌లా మారిపోయింది. నటన, రాజకీయం, సామాజిక సేవ.. ఇలా మూడు రంగాల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతూ, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణకి ఆయన అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. హ్యాపీ బర్త్‌డే బాలయ్య.