
Janhvi Kapoor:రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. కొందరు
ప్రేక్షకులు ఆ పాత్రను అవసరానికి మించి గ్లామర్ కోణంలో చూపించారని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ కి ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ సినిమాల్లో మహిళల పాత్రల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ, "మనం ఏ పాత్ర చేయాలనేది ముందే అంగీకరిస్తాం. గ్లామర్ సన్నివేశాలు కూడా కథలో భాగంగా ఉంటే వాటికి ఓకే చెబుతాం. కానీ ఒక నటిని కేవలం ఆమె శరీరాన్ని మాత్రమే చూపించేలా ప్రదర్శించడం సరైన విషయం కాదు" అని చెప్పింది.
ఇంటర్వ్యూలో జాన్వీ మరో ఆసక్తికర విషయం కూడా చెప్పింది. షూటింగ్ సమయంలో తనకు అసౌకర్యంగా అనిపించే కెమెరా యాంగిల్స్ ఉంటే ఇప్పుడు స్పష్టంగా చెప్పగలుగుతున్నానని వెల్లడించింది.
"గతంలో కొన్నిసార్లు నో చెప్పడానికి భయపడేదాన్ని. ఇప్పుడు మాత్రం నాకు నచ్చని షాట్ల గురించి మర్యాదగా నా అభిప్రాయాన్ని చెబుతాను" అని జాన్వీ పేర్కొంది.
పెద్ది సినిమాలో అచ్చియమ్మ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా హీరోయిన్ పాత్రను కథ కంటే గ్లామర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి చూపించారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ చర్చ పెరగడంతో దర్శకుడు బుచ్చిబాబు సాన సోషల్ మీడియాలో క్షమాపణలు కూడా చెప్పారు. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూ కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం జాన్వీ కపూర్ గతంలో చెప్పిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఆమె అప్పట్లో చెప్పిన మాటలను ఇప్పుడు పెద్ది వివాదంతో పోలుస్తూ నెటిజన్లు చర్చిస్తున్నారు. దీంతో జాన్వీ పాత ఇంటర్వ్యూ మరోసారి వార్తల్లో నిలిచింది.