
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ఇవాళ ఆయన విశాఖ కేజీహెచ్‌కు వెళ్లి, బాధితుల కుటుంబ సభ్యులను కలిసి తన
ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ వెంట కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు ఉన్నారు.బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం మంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడారు. "బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకే కేంద్ర, రాష్ట్ర ఎన్డీయే ప్రభుత్వ ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చాం. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటాం. వారి కుటుంబాలకు జీవితాంతం తోడుగా నిలుస్తాం" అని హామీ ఇచ్చారు. ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిన తర్వాత బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అందరం కలిసికట్టుగా పోరాడటం వల్లే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోగలిగామని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తుచేశారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కూడా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.