ఓ వ్యక్తి తన భార్యను వదిలేసి.. ఆమె తల్లిని ఇష్టపడి, తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. విస్తుగొలిపే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో చోటుచేసుకుంది. కాన్పూర్ దేహత్‌కు చెందిన ఒక మహిళ, ఆమె
అల్లుడు పరస్పర అంగీకారంతో కోర్టులో వివాహం చేసుకున్నట్లు చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నివేదికల ప్రకారం.. ఈ సంఘటన అక్బర్పూర్ ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రాగా.. మెడలో దండలు, వివాహ ధ్రువీకరణ పత్రాన్ని పట్టుకున్న జంట ఇందులో కనిపిస్తున్నారు. అత్తాఅల్లుళ్ళు తమ బంధాన్ని సమర్థించుకుంటూ, తమ జంటకు మద్దతు ఇవ్వాలని కోరడం గమనార్హం. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.పెళ్లి తర్వాత అత్తారింటికి వచ్చిన అల్లుడు.. అత్తా మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, ఇద్దరి మధ్య వయసులో తేడా ఉన్నప్పటికీ.. లోకం ఏమనుకున్నా పర్వాలేదంటూ ఇంటి నుంచి పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామంటూ ఆ సర్టిఫికేట్‌ను చూపించి, తమ బంధాన్ని ఆమోదించాలని కోరుతున్నారు. అయితే, దీనిపై అతడి భార్య స్పందన ఏంటి అనేదానిపై స్పష్టతలేదు. కానీ, సోషల్ మీడియాలో కొంతమంది దీనిని వ్యక్తిగత నిర్ణయంగా భావిస్తుండగా, మరికొందరు రోజు రోజుకీ సమాజంలో నైతిక విలువలు దిగజారిపోతున్నాయని ఆందోళనలను వ్యక్తం చేశారు. సొంత కూతురి కాపురంలోనే తల్లి నిప్పులు పోసిందని, ఇంకా ఎవరిని నమ్మాలని మండిపడుతున్నారు.కాన్పూర్ దెహత్ పోలీసులు ప్రకారం.. వీడియోపై విచారణ జరుగుతోంది. ఈ విషయంపై తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదులు లేదా సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు. ఆ మహిళకు, ఆమె అల్లుడికి చాలా కాలంగా సన్నిహిత సంబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. కోర్టులో వివాహం జరిగిన సమయం, ప్రదేశానికి సంబంధించిన వివరాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. అంతేకాకుండా, ఈ వివాహానికి సంబంధించిన పత్రాల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. గతంలో అలీగఢ్‌లో ఇటువంటి సంఘటనే జరగడం గమనార్హం.