
సౌరభ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. గత రెండున్నర దశాబ్దాల కాలంలో భారత క్రికెట్‌ను నడిపించిన మేటి సారథులు. వీరి తర్వాత టీమ్ఇండియా పగ్గాలు చేపట్టి సమర్థంగా నడిపించగల
ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్‌పై కొన్నేళ్ల ముందే అంచనాకు వచ్చారు క్రీడా విశ్లేషకులు. కానీ దేశవాళీల్లో, ఐపీఎల్లో కొన్నేళ్లుగా తన నాయకత్వ లక్షణాలను చాటుతూనే ఉన్నా.. శ్రేయస్‌పై సెలక్టర్ల దృష్టి పడలేదు. కెప్టెన్సీ సంగతి తర్వాత.. కనీసం టీ20, టెస్టు జట్లలో అతడికి చోటే లేదు. అయితే ఎట్టకేలకు శ్రేయస్ టైం వచ్చింది. భారత టీ20 కెప్టెన్‌గా అతను ఎంపిక కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
శ్రేయస్ గత కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్లో ఎంత గొప్పగా రాణిస్తున్నాడో తెలిసిందే. గత మూడు సీజన్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే.. అతడో మేటి కెప్టెన్ అని అర్థమవుతుంది. పదేళ్ల తర్వాత, 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం శ్రేయసే. ఇక లీగ్‌లో అత్యంత బలహీన జట్లలో ఒకటి, ఎవరి దృష్టిలోనూ లేని పంజాబ్ కింగ్స్ జట్టు శ్రేయస్ పగ్గాలందుకోగానే ఎలా మారిపోయిందో గత సీజన్లో చూశాం. ఇన్నేళ్ల ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారి (2020) మాత్రమే ఫైనల్‌కు చేరగా.. ఆ సీజన్లో కెప్టెన్ అయ్యరే. ఐపీఎల్లో మూడు భిన్న జట్లను ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్ శ్రేయసే. ఈ ముంబయి కుర్రాడు ఎంత గొప్ప కెప్టెనో చెప్పడానికి ఇంతకంటే రుజువులేం కావాలి. దేశవాళీల్లో ముంబయి జట్టును కూడా సమర్థంగా నడిపించిన రికార్డు అతడికి ఉంది. ఇన్ని ఘనతలు సాధించిన అతన్ని ఇన్నేళ్లు ఏ ఫార్మాట్లోనూ టీమ్ఇండియాకు కెప్టెన్‌ను చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కేవలం కెప్టెన్‌గానే కాదు.. ఆటగాడిగానూ శ్రేయస్ నిలకడగా రాణిస్తున్నాడు. గత సీజన్లో 17 మ్యాచ్‌ల్లో 604 పరుగులు చేసిన అతను.. ఈ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 498 పరుగులు సాధించాడు.
రెండేళ్లకు పైగా శ్రేయస్ భారత జట్టుకు కేవలం వన్డేల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. గతంలో టెస్టులు, టీ20ల్లోనూ ఆడాడు కానీ.. నిలకడ లేకపోవడం, ఫిట్నెస్ సమస్యల వల్ల చోటు నిలుపుకోలేకపోయాడు. గత మూడేళ్లలో శ్రేయస్‌కు తీవ్ర గాయాలతో నెలలతరబడి జట్టుకు దూరమైన సందర్భాలు మూడు ఉండడం గమనార్హం. దీనికితోడు ఫామ్తోనూ తంటాలు పడ్డాడు. కానీ గత రెండేళ్లుగా అతను ఐపీఎల్లో, దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్నా సరే.. సెలక్టర్లు టెస్టు, టీ20 జట్లకు పరిగణనలోకి తీసుకోలేదు. ముఖ్యంగా ఐపీఎల్ ప్రదర్శన చూశాక.. శ్రేయస్‌ను టీ20 జట్టులోకి తీసుకోవాలని, కెప్టెన్‌ను చేయాలని డిమాండ్లు గట్టిగా వినిపించాయి. మాజీ కోచ్ ద్రవిడ్‌తో పాటు తన స్థానంలోకి వచ్చిన గౌతమ్ గంభీర్‌తోనూ శ్రేయస్‌కు సన్నిహిత సంబంధాలు లేవని.. శ్రేయస్ యాటిట్యూడ్ వల్ల సెలక్టర్లలో కూడా అతడిపై సానుకూల భావన లేదని.. అందుకే అతడిపై శీతకన్నేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే దీర్ఘకాలం ఉత్తమ ప్రదర్శన చేసే ఆటగాడిని ఎవరూ అడ్డుకోలేరు. ఓవైపు సూర్య పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇంకోవైపు శ్రేయస్ కెప్టెన్‌గా, ఆటగాడిగా అదరగొడుతున్నాడు. అలాంటప్పుడు వ్యక్తిగత సంబంధాలు, అభిప్రాయాలను పక్కనపెట్టి అభిమానుల డిమాండ్‌కు తలొగ్గక తప్పని పరిస్థితి టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లకు కలిగింది. ఈనేపథ్యంలోనే సూర్య స్థానంలో రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు శ్రేయస్‌ను టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.