ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025లో నిర్వహించిన మెగా డీఎస్సీపై ఆరోపణలు వచ్చాయి. డీఎస్సీలో టీచర్ల పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైఎస్సార్సీపీ ఆరోపించడం.. కొందరు అభ్యర్థులు జగన్‌ను కలవడంతో ఈ
అంశం చర్చనీయాంశమైంది. 2025 డీఎస్సీకి సంబంధించి హారిజాంటల్ రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చింది. డీఎస్సీలో రిజర్వేషన్ల విషయానికి వస్తే ఓపెన్ కేటగిరీ - 40శాతం, బీసీ - 29శాతం, ఎస్సీ - 15, ఎస్టీ- 6, ఈడబ్ల్యూఎస్- 10 రిజర్వేషన్లు ఉంటాయి. మహిళల కోటా- 33.3 శాతం, క్రీడాకారుల కోటా- 3శాతం, మాజీ సైనికోద్యోగులు- 2 శాతం, దివ్యాంగులకు 4శాతం చొప్పున రిజర్వేషన్లు ఉన్నాయి. ఇంతకీ ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటి?.. గతంలో ఉన్న వర్టికల్.. ఇప్పుడున్న హారిజాంటల్‌కు మధ్య తేడా ఏంటి?. గతంలో రిజర్వేషన్లు ఎలా అమలయ్యాయి?.. ప్రస్తుతం చేపడుతున్న ప్రక్రియ ఎలా ఉంది అనే అంశాలను ఓసారి పరిశీలిస్తే సరిపోతుంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో హారిజాంటల్ రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టు 2న దీనిపై జీవో 77 విడుదలైంది. అప్పటి నుంచే అన్ని నోటిఫికేషన్లకు హారిజాంటల్ విధానాన్ని అమలు చేశారు. వర్టికల్, హారిజాంటల్ విధానాలను సమాంతరంగా అమలు చేస్తున్నారు. వర్టికల్ విధానం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌కు ఉంది.. హారిజాంటల్ విధానంలో మహిళా, క్రీడా, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. హారిజాంటల్ విధానంలో ఉన్న నాలుగు కేటగిరీలకు ఫిక్స్డ్ రోస్టర్ తొలగించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. మొత్తం పోస్టుల్లో అటు మెరిట్లో గానీ, ఇటు రిజర్వ్‌డ్‌లో గానీ ఎక్కడైనా వారికి ఉద్యోగాలు దక్కితే సరిపోతుందనే ఉద్దేశం ఉంది. హారిజాంటల్ విధానంలోని కేటగిరీల అభ్యర్థులకు మెరిట్లో ఉద్యోగాలు వస్తే రిజర్వేషన్ ప్రత్యేకంగా అమలు చేయరు. చివరిలో మెరిట్ వాళ్ల స్థానంలో వీళ్లను సర్దుబాటు చేస్తారు. మెరిట్ భర్తీ చేసిన తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్లో ఆయా పోస్టులను భర్తీ చేస్తారు.ఈ రిజర్వేషన్ విధానంపై అవగాహన లేకపోవడంతో అభ్యర్థులు కొందరు అన్యాయం జరిగిందని అపోహ పడుతున్నారని ప్రభుత్వం చెబుతోంది.హారిజాంటల్ విధానం గురించి పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ చిన్న ఉదాహరణతో వివరించారు. ' ఒక బస్సు ఉంది.. అందులో 100మంది ప్రయాణికుల్ని ఎక్కించాలనుకుందాం. వీళ్లలో 33మంది మహిళలు కచ్చితంగా ఉండాలి.. అప్పుడు వారిని వరుసగా ఎక్కిస్తుంటే.. మొదటి 66 మందిలోనే 33 మంది మహిళలు ఉంటే.. మిగతా సీట్లను లైన్ ప్రకారం భర్తీ చేస్తాము. ఒకవేళ అలా లేకపోతే 66 మంది తర్వాత లైన్‌ను ఆపేస్తా.. అప్పుడు చివర్లో ఉన్న మహిళలను ముందుకు పిలిచి బస్సులోకి ఎక్కిస్తాం. అలాంటి సమయంలో లైన్లో ముందున్న పురుషులు అన్యాయం జరిగిందంటే కుదరదు' అంటూ వివరించారు. రిజర్వేషన్ విధానం అలాగే ఉంది అన్నారు.2025 మెగా డీఎస్సీలో క్రీడాకారుల కోటా విషయానికి వస్తే.. ప్రాథమిక ఎంపిక జాబితాలో అభ్యర్థులను చూపించారు. ఓసీ, మిగిలిన సామాజిక కోటాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆతర్వాత హారిజాంటల్ విధానంలోని మహిళలు, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎంపి చేశారు. ఒక్కో కేటగిరీ వారిగా చూసుకుని.. ఆ కోటాలో వచ్చిన సంఖ్యకు సరిపడా అభ్యర్థులు ఉన్నారా? లేదా? అని పరిశీలించారు. ఒకవేళ ముందుగా పోస్టులు భర్తీ అయితే చివరిలో ప్రత్యేకంగా ఆ కేటగిరీల అభ్యర్థుల కోసం వేచి చూడకుండా.. లేకుంటే ఆ మూడు విభాగాల అభ్యర్థులను చివరి మెరిట్ అభ్యర్థుల స్థానంలో సర్దుబాటు చేశారు.డీఎస్సీ పోస్టుల భర్తీలో.. వర్టికల్ విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు వర్తించే రిజర్వేషన్‌ను అమలు చేస్తారు.. వీళ్లకు ముందుగానే ఫిక్స్ చేసిన రోస్టర్ పాయింట్లు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలు 1 నుంచి 100 వరకు ఉండే రోస్టర్ సైకిల్లో ఎవరు ఎక్కడ ఉండాలో స్థానాలు నిర్ణయించారు. గతంలో మొత్తం వర్టికల్ విధానం అమల్లో ఉండేది. అప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌తో పాటుగా మహిళా, క్రీడా, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలకు కూడా ఫిక్స్డ్ రోస్టర్ ఉండేది. పోస్టుల భర్తీలో కేటగిరీల్లో ర్యాంకుల ఆధారంగా వరుసగా ఆ రోస్టర్ పాయింట్లో వారిని ఎంపిక చేసేవారు. హారిజాంటల్ విధానంలోని మహిళా, క్రీడా, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ విభాగాల్లో ప్రతిదానికీ మహిళల కోటా వర్తించాలి. మిగిలిన అంతర్ కేటగిరీల్లోనూ 33.3 శాతం మహిళలకు కోటా ఉంటుంది. అయితే పీహెచ్, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్‌కు వారి కోటాలు వేర్వేరుగా వర్తింపజేయరు. మొత్తంగా 100 పాయింట్లను పరిగణలోకి తీసుకుని అందులో వారు ఉన్నారా? లేదా? అనేది చూస్తారు. అందుకే నోటిఫికేషన్ సమయానికి ఈ మూడు కేటగిరీల అభ్యర్థులు ఏ సామాజిక కోటాలోకి వెళ్తారో తెలియదు. డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియలో 1:1 నిష్పత్తిని మించి అభ్యర్థులను పిలిచారు. పీహెచ్సీ అభ్యర్థుల్లో ఎంపిక చేసిన వారి సర్టిఫికెట్లు అనర్హమైనవి అయితే వారి స్థానంలో మరో పీహెచ్ కోటా అభ్యర్థికి పిలుపు వచ్చింది. రెండోసారి ఎంపికైన పీహెచ్ అభ్యర్థి సామాజిక వర్గం మారితే.. అదే సామాజిక వర్గంలో ఉండి, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తైన జనరల్ మెరిట్లో అభ్యర్థి ఉద్యోగాన్ని కోల్పోయారు.