
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన బొద్దింక వ్యాఖ్యల తర్వాత పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) సోషల్ మీడియాలో కేంద్రాన్ని ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్న క్రమంలో ఆ పార్టీ ఎక్స్ ఖాతాను కేంద్రం ఎక్స్ సాయంతో నిలిపివేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది.
ఈ విచారణ తర్వాత ఢిల్లీ హైకోర్టు కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ పై కీలక ఆదేశాలు ఇచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, తన ఎక్స్ (X) ఖాతాను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఎక్స్ కు నోటీసులు జారీ చేసింది.అయితే ఈ కేసును విచారించిన జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్..
కాక్రోచ్ పార్టీ ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించడానికి నిరాకరించారు. ఈ సమస్యకు సుదూర పరిణామాలు ఉన్నందున, ప్రభుత్వం వాదనలు విన్న తర్వాతే అటువంటి ఉపశమనం కల్పించగలమని కోర్టు పేర్కొన్నారు. మీ వాదనలలో కొంత సారం ఉండవచ్చు, కానీ వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
అవతలి పక్షం వాదనలు విన్న తర్వాత వాటిని సమగ్రంగా పరిశీలిస్తామన్నారు. ఇవి సుదూర సంబంధిత సమస్యలని, వీటికి విస్తృత పరిణామాలు ఉన్నాయని జడ్జి తెలిపారు. కేంద్రం స్పందన ఆధారంగా అకౌంట్ నిలిపివేత ఉత్తర్వును రికార్డులో ఉంచమని X ను ఆదేశించవచ్చా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.
ఈ రోజు నుండి నాలుగు వారాలలోగా కేంద్రం స్పందన దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే నిలిపివేత ఉత్తర్వును సమీక్షించాలని కూడా కోర్టు ఆదేశించింది. సంబంధిత నిబంధనల ప్రకారం ప్రతి రెండు
నెలలకు ఒకసారి సమీక్షా కమిటీ సమావేశం కావాల్సి ఉంటుందని తెలిపింది. నిరోధక ఉత్తర్వుకు వ్యతిరేకంగా ఉన్న అన్ని అంశాలను పరిశీలించే అధికారం ఈ కమిటీకి ఉందని కోర్టు వివరించింది. దీప్కే భారత్ లో లేనందున, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు సమీక్షా కమిటీకి ఆయన అభ్యర్థన చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది.