తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ప్రజల్లో కొన్ని అపోహలు, ఆందోళనలు మొదలయ్యాయి. ఓటర్ల జాబితా సవరణ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే తుది
లిస్టులో పేరు లేకపోతే రేషన్ కార్డులతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు అవుతాయంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. 'రేషన్ లబ్ధిదారులకు అలర్ట్.. ఆ లిస్టులో పేరు లేకుంటే కార్డు తొలగింపు..?' అంటూ కొందరు వాట్సాప్, ఫేస్బుక్ వేదికగా పోస్టులు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఏర్పడిన నూతన ప్రభుత్వం.. అక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన 63 లక్షల మందికి రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ ప్రయోజనాలను రద్దు చేసే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించడమే ఈ భయాందోళనలకు ప్రధాన కారణమైంది. అక్కడ ఓటర్ల లిస్టులో పేర్లు లేని వారిని అనర్హులుగా గుర్తిస్తూ లబ్ధిదారుల జాబితా నుండి తొలగిస్తుండటంతో.. ఆ ప్రభావం ఎక్కడ ఏపీ, తెలంగాణలపై పడుతుందోనని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.అయితే, ఈ ప్రచారాలపై ఎన్నికల సంఘం, ఉభయ రాష్ట్రాల రెవెన్యూ అధికారులు స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి అస్సలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ ద్వారా అమలయ్యే సంక్షేమ పథకాలకు, ఓటర్ల జాబితా సవరణకు నేరుగా ఎలాంటి లింక్ ఉండదని వివరించారు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్లగానీ, ఇల్లు మారడం లేదా క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో అందుబాటులో లేకపోవడం వల్లగానీ ఓటర్ల జాబితాలో పేరు తొలగించబడినా దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని గుర్తుచేశారు. బాధితులు వెంటనే ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా గానీ, జాతీయ ఓటర్ల సేవా పోర్టల్ (NVSP) ద్వారా గానీ ఆన్లైన్లో ఫామ్-6 సమర్పించి తమ పేరును తిరిగి నమోదు చేసుకోవచ్చునని సూచించారు. ఆన్లైన్ వీలుకాని వారు తమ స్థానిక పోలింగ్ కేంద్రం వద్ద ఉండే బూత్ లెవెల్ అధికారిని కలిసి దరఖాస్తు చేసుకోవచ్చునని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.