
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కోసం తాను ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సౌరవ్ గంగూలీ కోరినట్టు వచ్చిన వార్తలపై యూసుఫ్ పఠాన్ స్పందించారు. తనను ఎవరూ అలా అభ్యర్థించలేదని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ డెస్క్
: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కోసం తాను ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అభ్యర్థనలు వచ్చినట్టు మీడియాలో కథనాలు రావడంపై యూసుఫ్ పఠాన్ శనివారం స్పందించారు. మమతా బెనర్జీతో సహా పార్టీ నేతలు ఎవరూ తనను ఎంపీ సీటుకు రాజీనామా చేయమని కోరలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మీడియాలో వచ్చిన వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ లోక్‌సభ ఎంపీగా ఎన్నికవ్వాలని భావిస్తున్నట్టు ఇటీవల మీడియాలో వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఇందుకోసం యూసుఫ్ పఠాన్‌తో రాజీనామా చేయించి ఆ తరువాత ఉపఎన్నికలో మాజీ సీఎం మమత పోటీ చేసేలా ప్లాన్ జరుగుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి. మమతా బెనర్జీ తరఫున మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ యూసుఫ్‌తో సంప్రదింపులు జరిపినట్టు కూడా స్థానిక మీడియాలో వార్తలు వెలుగు చూడటంతో కలకలం రేగింది.
ఈ వార్తలపై సౌరవ్ గంగూలీ కూడా స్పందించారు. ఆ కథనాల్లో అసలేమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. మీడియా కథనాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వదంతుల ఆధారంగా కథనాలను ప్రచురించవద్దని హితవు పలికారు. వాస్తవాలను ముందుగా నిర్ధారించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఈ వార్తలకు చెక్ పెట్టేందుకు స్వయంగా యూసుఫ్ పఠాన్ రంగంలోకి దిగారు. సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. రాజీనామా అంశాన్ని టీఎంసీ అధినేత్రి ఎన్నడూ తన వద్ద ప్రస్తావించలేదని అన్నారు. తమ చివరి సమావేశంలో కూడా ఈ ప్రస్తావన రాలేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటనలూ లేకపోయినా చర్చ జరుగుతుండటం విచారకరమని అన్నారు. యూసుఫ్ పఠాన్ ప్రస్తుతం బహరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
సామాన్యుడిపై మరోసారి గ్యాస్ భారం.. పెరిగిన డొమెస్టిక్ సిలిండర్ ధరలు
రీవాల్యూయేషన్ కూడా ‘కోఎంప్ట్ ఎడ్యుటెక్’ సంస్థతోనే