
ఇంటర్నెట్ డెస్క్: మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee)పై టీఎంసీ రెబల్ నేత రితబ్రత బెనర్జీ (Ritabrata Banerjee) తీవ్ర ఆరోపణలు చేశారు. అభిషేక్ వల్లే పార్టీలో అంతర్గత
తిరుగుబాటు చెలరేగిందని ఆరోపించారు. మమతను తాము గౌరవిస్తున్నామని.. అయితే, తమపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ పెత్తనాన్ని మాత్రం అంగీకరించబోమని స్పష్టంచేశారు. పార్టీ కోసం ఏమీ చేయకపోయినా దీదీ ఆయనకు ఉన్నత స్థానాన్ని కట్టబెట్టారని విమర్శించారు. బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి అనంతరం మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసంలో సమావేశం నిర్వహించారని రితబ్రత పేర్కొన్నారు.
పార్టీ కోసం అభిషేక్ చేసిన కృషికి గాను నిలబడి చప్పట్లు కొట్టాలని సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తలకు మమత (Mamata Banerjee) సూచించారని రితబ్రత పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన బాధలో ఉన్న తమను ఈ చర్య మరింత బాధించిందన్నారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలతో సంతకాలు తీసుకున్నారని.. హాజరు కాని వారి పేర్లను అధికారిక రికార్డుల్లో రాసుకున్నారని ఆరోపించారు. టీఎంసీలో అవినీతి బాగా పెరిగిపోయిందని.. దానిని ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ప్రస్తుతం 61 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని.. రాబోయే రోజుల్లో మరికొంతమంది తమతో పాటు కలిసే అవకాశం ఉందన్నారు.
కాగా, టీఎంసీ పార్టీలోని చాలా మంది నాయకులు అభిషేక్ బెనర్జీ పనితీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సువేందు అధికారి సహా పలు నేతలు పార్టీని వీడి వెళ్లడానికి కూడా అభిషేక్ వైఖరే కారణమన్న ఆరోపణలూ ఉన్నాయి. మమత కష్టపడి క్షేత్రస్థాయి నుంచి పార్టీని నిర్మిస్తే.. అభిషేక్ తృణమూల్‌ను ఐ-ప్యాక్ లాంటి కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టారని పలువురు నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్టీ ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం ఆయనేనని నిందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేనల్లుడి విషయంలో దీదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
అమెరికా, మెక్సికో, కెనడా వేదికలుగా ఈ నెల 11 నుంచే ఫిఫా వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో కేరళలోనూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం పెరిగింది.