పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పరిస్థితి చేజారుతుండటంతో అధినేత్రి మమతా బెనర్జీ
చక్కదిద్దుకునేందుకు చర్యలకు ఉపక్రమించారు. సంస్థాగతంగా పార్టీని 360 డిగ్రీల్లో ప్రక్షాళనకు నడుంబిగించారు. ఇందులో భాగంగా పార్టీలో అసంతృప్తికి, తిరుగుబాటుకు ప్రధాన కారణమైన తన మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ రెక్కలు కత్తిరించారు. ఒకప్పుడు ఆయన మాటే శాసనంగా సాగిన అభిషేక్.. ఇకపై మరో ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. తన సన్నిహిత ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, డోలా సేన్లను ఆ స్థానంలో నియమించింది. ఏదైనా నిర్ణయాన్ని ముగ్గురు కలిసి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అభిషేక్ కూడా చర్యలకు అతీతుడు కాదనే సందేశం దీదీ పంపారు.తృణమూల్‌లో ప్రస్తుత తిరుగుబాటును, మమతా బెనర్జీకి కంటే ఎక్కువగా అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుగా చూస్తున్నారు. అసెంబ్లీ ఫలితాల తర్వాత జరిగిన ఒక సమావేశంలో ఎన్నికల్లో తన మేనల్లుడి పాత్రను అభినందించాలని నాయకులను మమతా బెనర్జీ కోరినట్లు సమాచారం. పార్టీ ప్రజాదరణ కోల్పోవడానికి అభిషేక్ బెనర్జీ వైఖరే ప్రధాన కారణమని భావించిన చాలా మందికి ఈ చర్య ఆగ్రహం తెప్పించిందని వర్గాలు తెలిపాయి. తిరుగుబాటుకు మొదటి బీజం అక్కడే పడి, ఆ క్షణం నుంచే టీఎంసీ శాసనసభ పక్షంలో చీలికలు మొదలయ్యాయి. మే 19న కాళీఘాట్‌లో జరిగిన మరో భేటీలో రెబల్స్ రీటాబ్రత బెనర్జీ, సాందీపన్ సాహా తొలిసారి బహిరంగంగా తమ అసమ్మతి బయటపెట్టారు.ఈ అసమ్మతి పూర్తిస్థాయి తిరుగుబాటుగా పరిణమించింది. దీంతో మమతా బెనర్జీ సంస్థాగత నిర్మాణంలో మార్పులు తీసుకొచ్చి, దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇతర ముఖ్య నియామకాల్లో సీనియర్ నాయకురాలు చంద్రమా భట్టాచార్య రాష్ట్ర అధ్యక్షురాలిగా పదోన్నత కల్పించారు. ఇది పార్టీలో కొత్తతరం, సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు సంకేతంగా నిలిచింది. సుబ్రతా బక్షి జాతీయ కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాగే, పార్టీలోని అన్ని విభాగాల్లోనూ కొత్త ముఖాలను తీసుకొచ్చారు. పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఉపాధ్యక్షులుగా సజ్దా అహ్మద్, మమతా ఠాకూర్, నయనా బందోపాధ్యాయ్, స్వాతి ఖండేకర్లను నియమించారు.సంక్షోభం కొనసాగుతోన్న తరుణంలో తనకు అండగా నిలిచిన నమ్మకస్తులు, సీనియర్లకు కీలక బాధ్యతలను దీదీ అప్పగించారు. రెబల్స్‌పై టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార ఒత్తిడితోనే వారు పార్టీని వీడుతున్నారని ఆరోపించారు. ‘‘ఎన్నికలు జరిగి కనీసం నెల రోజులైనా కాలేదు.. వేళ్లపై ఎన్నికల సిరా కూడా చెరిగిపోలేదు.. బీజేపీ ఇంకా తన మంత్రులకు శాఖలను కేటాయించలేదు.. అప్పుడే వీళ్లు ఇలా చేస్తున్నారు.. వాళ్లంతా మమతా బెనర్జీ పేరుతోనే ఎన్నికల్లో గెలిచారు.. వాళ్లు క్యారెక్టర్ ఏంటో వారి చర్యలే చెబుతున్నారు.. కానీ, పార్టీ కార్యకర్తలు మాత్రం మమతాతోనే ఉన్నారు’’ అని ఆయన స్పష్టం చేశారు.