పల్నాడు జిల్లాలో పెను దుమారం రేపిన సీఐ చిన్న మల్లయ్య పై వచ్చిన అత్యాచార ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తన పట్ల సీఐ చిన్న
మల్లయ్య అసభ్యకరంగా ప్రవర్తించారని.. ఆపై తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనం రేపింది. ఈ క్రమంలోనే ఆ మహిళ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఈ కేసులో విచారణ జరపగా.. సీఐ చిన్న మల్లయ్యపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలాయి. దీంతో అతడిని ఉద్యోగం నుంచి ఉన్నతాధికారులు డిస్మిస్ చేశారు. ఇక ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు సుప్రీంకోర్టులో మాజీ సీఐ చిన్న మల్లయ్య ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అటు ఉద్యోగం పోయి, ఇటు కోర్టులో బెయిల్ రాకపోవడంతో.. చేసేదేమీ లేక దిక్కుతోచని స్థితిలో చిన్న మల్లయ్య తాజాగా వినుకొండ పోలీసుల ముందు లొంగిపోయాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు. ఏప్రిల్ 29వ తేదీన వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో తనపై చిన్న మల్లయ్య అత్యాచారం చేశాడని ఓ మహిళ వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఉద్యోగంలో నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఐజీ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక అప్పటినుంచి అజ్ఞాతంలో ఉన్న చిన్న మల్లయ్య.. ఈ కేసులో తన అరెస్ట్ తప్పదని భావించి.. ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. గత నెల 14వ తేదీన హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. అక్కడా నిరాశే మిగిలింది. ఈ క్రమంలోనే ఈ కేసులో తాను తప్పించుకునేందుకు ఉన్న దారులన్నీ మూసుకుపోవడంతో చిన్న మల్లయ్య అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది.ఈ నేపథ్యంలోనే మారువేషంలో బైక్‌పై గురువారం మధ్యాహ్నం 2.40 గంటలకు వినుకొండ కోర్టుకు చిన్న మల్లయ్య వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వినుకొండ జడ్జి సెలవులో ఉండటంతో చిలకలూరిపేట కోర్టు జడ్జి ఇంఛార్జి అని కోర్టు సిబ్బంది తెలపడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వినుకొండకు చిన్న మల్లయ్య వచ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే అప్పటికే అతడు వెళ్లిపోవడంతో.. గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి చిన్న మల్లయ్య వినుకొండ పీఎస్‌లో సరెండర్ కావడం గమనార్హం.