పాలమూరు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీనే కట్టిందని.. గత
పాలమూరు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీనే కట్టిందని.. గత 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టును కట్టారని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ నేతలు పాదయాత్రలు చేస్తామని అంటున్నారని.. అయితే పాదయాత్రలు కాదు.. పాలమూరు నుంచి కాశీకి పొర్లుదండాలు చేసినా వారి పాపాలు తీరవు అని మండిపడ్డారు. పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ఇక్కడి ప్రజలు మర్చిపోరని.. ఈ జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఉండదని, ఎమ్మెల్యే గెలవరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను గురు, శుక్రవారాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. జడ్చర్ల మండలం గంగాపూర్ బహిరంగ సభలో ప్రసంగించారు.20 ఏళ్ల క్రితం పాలమూరు జిల్లాలో నాటిన మొక్క.. ఇప్పుడు తెలంగాణ సీఎంగా వృక్షమై నిలబడ్డాడని.. తనను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మిడ్జిల్ నుంచే తాను మొదట జడ్పీటీసీగా గెలిచానని.. అప్పటి జడ్పీటీసీనే.. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలమూరు జిల్లా ప్రజల ముందున్నానని.. ఇక్కడి సమస్యలన్నింటినీ తీరుస్తానని రేవంత్ రెడ్డి మాటిచ్చారు. గతంలో కరీంనగర్లో ఓడిపోతాననే భయంతో కేసీఆర్ పాలమూరుకు వచ్చారని.. వలస వచ్చిన నేతను మహబూబ్నగర్ ఎంపీగా గెలిపించుకున్నామని.. అయితే 5 ఏళ్లు ఎంపీగా ఉన్న కేసీఆర్.. 5 సార్లు కూడా పాలమూరుకు రాలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ మేకవన్నె పులి అని తెలియక.. తెలంగాణ ప్రజలు రెండుసార్లు గెలిపించారని ఆరోపించారు. కేసీఆర్ కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయిందని.. ఇక ఏం చేసినా బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.22 వేల కోట్లలో రూ.8 వేల కోట్లను పాలమూరు జిల్లా ప్రాజెక్టులకే ఖర్చు చేసినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామని.. 200 ఎకరాల్లో ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తు చేశారు. పాలమూరు వలసలు ఆగాలంటే జిల్లా సస్యశ్యామలం కావాలని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూంలు కట్టిన చోటే బీఆర్ఎస్ ఓట్లడగాలని.. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోటే తాను ఓట్లు అడుగుతా అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 30 నెలల పాలన గురించి చెబితే రామాయణం.. రాస్తే భారతం అవుతుందని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన.. తన 30 నెలల కాంగ్రెస్ పరిపాలనపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఇరువురి పాలనపై కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చిద్దామని.. ఆ చర్చలో తాను ఓడిపోతే క్షమాపణలు చెబుతానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన.. కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్ల పాలనపై తాము చర్చకు రెడీ అని పేర్కొన్నారు. 'నీ పేరు కేసీఆర్ అయితే.. దమ్ముంటే చర్చకు రా' అని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కు బహిరంగ సవాల్ చేశారు. చర్చలో ఓడిపోతే తాను ఏం చేయడానికైనా రెడీ అని ప్రకటించారు. పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురనివ్వమని.. జెండాలు గద్దెలు దిగాలని.. గులాబీ దిమ్మెలు కూలాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలమూరు గడ్డపై ఇక బీఆర్ఎస్ గుర్తు మర్చిపోవాలని.. కారు గుర్తు, గులాబీ ఎమ్మెల్యే అనేది ఇక గతమేనని.. ఆ పార్టీ నుంచి భవిష్యత్తులో ఒక్కరినీ గెలవనివ్వమని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.