
గింగిరాలు తిరిగే బంతి వస్తే.. దానికి బౌండరీ లైన్ చూపించేంత నైపుణ్యం కలిగిన బ్యాటర్లు మన సొంతం.. షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ వంటి హేమాహేమీల బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి మిగతా జట్ల బ్యాటర్లు ఇబ్బంది
గింగిరాలు తిరిగే బంతి వస్తే.. దానికి బౌండరీ లైన్ చూపించేంత నైపుణ్యం కలిగిన బ్యాటర్లు మన సొంతం..
షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ వంటి హేమాహేమీల బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి మిగతా జట్ల బ్యాటర్లు ఇబ్బంది పడితే.. టీమ్ఇండియా స్టార్లు మాత్రం చెలరేగిపోయారు.
ఇప్పుడు పార్ట్ టైమ్ స్పిన్నర్లకూ తమ వికెట్లు ఇచ్చేస్తున్నారు భారత బ్యాటర్లు.
కాసేపు క్రీజ్‌లో ఉండాలంటేనే చెమటలు పట్టేస్తున్నాయి యువ క్రికెటర్లకు..
దాన్నుంచి జట్టును బయట పడేసేందుకే బీసీసీఐ కీలక నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరిచింది.
అవును.. టీమ్ఇండియాకు కొత్తగా స్పిన్ కోచ్ వచ్చాడు. అదేంటీ! ఇప్పటివరకు మనకు స్పిన్ కోచ్ లేడా? అనే అనుమానం రాకమానదు. భారత జట్టుకు ప్రత్యేకించి స్పిన్ కోచ్ అంటూ ఇప్పటివరకు లేడు. తొలిసారి సాయిరాజ్ బహుతులే అనే మాజీ స్పిన్నర్‌ను బీసీసీఐ నియమించింది. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారిపోయింది. భారత క్రికెట్ బోర్డు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? గత పరాభవాలు పునరావృతం కాకూడదనేదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందనేది విశ్లేషకుల మాట.
భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చిన కొత్తలో.. స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను టీమ్ఇండియా కోల్పోయింది. అదీనూ 0-3 తేడాతో క్లీన్‌స్వీప్ కావడంతో సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. ఆ టెస్టుల్లో భారత్ విఫలం కావడానికి ప్రధాన కారణం స్పిన్ పిచ్లే. ప్రత్యర్థిని బుట్టలో వేద్దామని భావిస్తే.. చివరికి కివీస్ స్పిన్నర్ల దెబ్బకు మన బ్యాటర్లే బోల్తా పడ్డారు. దీంతో భారత్ ఘోర పరాభవం చూవిచూసింది. మన బ్యాటర్లు స్పిన్‌ను ఎదుర్కోవడంలో తెగ ఇబ్బంది పడ్డారు. అటు మన స్పిన్నర్లూ ప్రభావం చూపించలేదు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా చేతిలోనూ మనకు ఓటమి తప్పలేదు.
మొన్నటి వరకూ ఆడిన విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా, రహానే వంటి బ్యాటర్లు స్పిన్‌ను కాచుకుని భారీగా పరుగులు రాబట్టారు. అంతకుముందు సచిన్, ద్రవిడ్, గంభీర్, ధోని, గంగూలీ, లక్ష్మణ్‌కూ ప్రత్యేకంగా స్పిన్ పాఠాలు నేర్పాల్సిన అవసరం రాలేదు. కానీ, ప్రస్తుతం టీమ్ఇండియాలో ఉన్న బ్యాటర్లంతా టీ20 క్రికెట్‌కు బాగా అలవాటు పడిపోయినవారే. క్రీజ్‌లో కాసేపు కుదురుకుని పరుగులు రాబడితే టెస్టుల్లో మనుగడ సాధ్యం. కట్టుదిట్టమైన ఫీల్డింగ్ సెటప్ పెట్టి.. రెండు వైపులా స్పిన్‌ను సంధిస్తే ఎలా ఆడాలనేది చాలా మంది యువ క్రికెటర్లకు తెలియట్లేదు. సింపుల్‌గా వికెట్లు సమర్పించేసి పెవిలియన్‌కు చేరతారు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే టీమ్ఇండియా టెస్టు భవితవ్యం మరింత ప్రశ్నార్థకంగా మారడం ఖాయం.
అఫ్గానిస్థాన్‌తో స్వదేశంలో శనివారం నుంచి టీమ్ఇండియా ఏకైక టెస్టు ఆడనుంది. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వంటి స్పిన్నర్లను సుదీర్ఘ ఫార్మాట్లో ఎదుర్కోవడం తేలికైన విషయం కాదు. అసలు ఇప్పుడు మన క్రికెటర్లు టీ20 మూడ్ నుంచి బయటకు రావాల్సి ఉంది. ఇప్పుడు సాయిరాజ్‌ను నియమించడం వల్ల యువ బ్యాటర్లకు అతడు స్పిన్‌ను ఎదుర్కొనేందుకు చిట్కాలు ఇస్తాడనేది బీసీసీఐ ఆలోచన. ఇక కొత్త బౌలర్లు మానవ్ సుతార్, హర్ష్ దూబేను భవిష్యత్తు అవసరాల కోసం సిద్ధం చేయాల్సి ఉంది.
అఫ్గాన్‌తో టెస్టు తర్వాత.. సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచుల కోసం టీమ్ఇండియా రాబోయే మూడు నెలల్లో శ్రీలంక, న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. అక్కడి పిచ్‌లు కూడా స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ అన్నింట్లోనూ గెలిస్తేనే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో టీమ్ఇండియా నిలిచేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. టాప్ -2లోకి రావాలంటే ఈ ‘స్పిన్’ అడ్డంకిని అధిగమించాలి. అందుకు సాయిరాజ్ బహుతులేను నియమించడం వెనుక కూడా ఓ కారణం ఉంది. అతడికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 630 వికెట్లు తీసిన అనుభవం ఉంది. పలు రాష్ట్రాల క్రికెట్ జట్లకు కోచింగ్ కూడా ఇచ్చాడు. ఐపీఎల్‌లోనూ అతడి సేవలను పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వినియోగించుకోవడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.