
దేశవ్యాప్తంగా వరుస ప్రశ్నాపత్రాల లీక్ లు, పోటీ పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) రేపు
దేశవ్యాప్తంగా వరుస ప్రశ్నాపత్రాల లీక్ లు, పోటీ పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) రేపు ఢిల్లీలో ఆందోళన నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అవాంఛనీయ పరిణామాలు తలెత్తకుండా కేంద్రం, పోలీసులు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిల్ అత్యవసర విచారణకు నిరాకరించింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్లాన్ చేసిన ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అమెరికా నుంచి కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే (Abhijeet Dipke) రేపు ఉదయం 8 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి రాబోతున్నాడు. అక్కడి నుంచి పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ కు వెళ్లి జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు అనుమతి కోరతాడు. అనుమతి లభిస్తే రేపు లేదా ఎల్లుండి ఆందోళనకు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో అభిజిత్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి యువత ఢిల్లీకి బయలుదేరినట్లు తెలుస్తోంది. దీంతో రేపు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు రావొద్దని, తాను మాత్రమే పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్ కు వెళ్లి జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి తీసుకుంటానని, అనుమతి వచ్చాక అక్కడే కలుసుకుందామని అభిజిత్ సూచించాడు.
అయినా ఈ ఆందోళనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతూ సేవ్ ఇండియా అనే ఎన్జీవో దాఖలు చేసిన పిల్ పై అత్యవసరణ విచారణకు ఢిల్లీ హైకోర్టు నో చెప్పేసింది. సేవ్ ఇండియా ఫౌండేషన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ లో శాంతిభద్రతల్ని కాపాడటానికి కీలకమైన మౌలిక సదుపాయాల కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేలా చూడటానికి, కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, ఇతర అధికారులను నివారణ, నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని కోరింది. తాము ఢిల్లీ పోలీసులకు నిన్న దీనిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకూ చర్యలు ప్రకటించలేదనని తెలిపింది. అయితే దీనిపై అత్యవసర విచారణకు మాత్రం హైకోర్టు తిరస్కరించింది.