
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి క్షేత్ర పర్యటన ఫొటో ఎగ్జిబిషన్లు, మ్యాపులు, ఏవీలతో వివరించిన అధికారులు నాలుగు జిల్లాల పరిధిలో ఏరియల్ వ్యూ జోగులాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం స్వరూపం గురించి ముఖ్యమంత్రికి వివరిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఈనాడు, మహబూబ్‌నగర్: పాలమూరు ప్రాజెక్టులను వేగవంతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పర్యటించారు. ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ఆయన నేరుగా కర్ణాటక మాజీ మంత్రి బోసురాజుతో కలిసి బెంగళూరు నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2.52 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్ చేరుకున్నారు. మక్తల్ జ్యోతిబాఫులే గురుకుల పాఠశాలలో ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం(ఎంఎన్‌కేఎల్‌ఐఎస్) పనుల పురోగతి, కృష్ణా, భీమా నదులపై కొత్తగా నిర్మించతలపెట్టిన రోడ్ కం బ్యారేజీలు, రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకాల చిత్రపటాలు, ప్రణాళిక మ్యాపులు పరిశీలించారు. ఆయా ప్రాజెక్టుల వివరాలను నీటిపారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంఎన్కేఎల్ఐఎస్కి, సంగంబండ ప్రాజెక్టులకు భూత్పూర్ రిజర్వాయర్ నుంచే నీటిని తరలించాల్సి ఉంటుందని, గోప్లాపూర్ పంపుహౌస్‌ను అందుకు తగినట్లుగా సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉందని స్థానిక నేతలు, అధికారులు ఆయనకు వివరించారు. కృష్ణా-భీమా నదులపై నిర్మించనున్న బ్యారేజీలతో ఏయే ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుంది.. వాటి సామర్థ్యం ఎంత.. ఎంత భూసేకరణ చేయాలి.. తదితర విషయాలను సీఎం.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన అనంతరం.. మక్తల్ ప్రజాప్రతినిధులు, మక్తల్ పురపాలక సంఘం, స్థానిక నేతలు, కార్యకర్తలను మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రికి పరిచయం చేయగా.. వారిని ఆప్యాయంగా పలకరించారు. మక్తల్ నుంచి రోడ్డు మార్గంలో మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి కాట్రేవుపల్లి సమీపంలో కొనసాగుతున్న మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనుల ప్రాంతానికి చేరుకున్నారు. ఫేజ్-1లో నిర్మిస్తున్న పంపుహౌస్ పనులు పరిశీలించారు. ఇవి ఎంత మేరకు పూర్తయ్యాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూడు నియోజకవర్గాల్లో
లక్ష ఎకరాలకు పైగా సాగునీటిని అందించే ప్రాజెక్టు పనులను అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో వేగవంతం చేయాలని, కాంక్రీటు పనులను ప్రారంభించి నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి తిరిగి మక్తల్‌కు చేరుకున్నారు.
ఏరియల్ వ్యూ అనంతరం సీఎం హెలికాప్టర్లో 4.30 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లా గుడ్డెందొడ్డికి చేరుకుని రిజర్వాయర్, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం(జేఎన్‌ఎల్‌ఐఎస్) స్టేజ్-1 పంపుహౌస్‌ను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను వీక్షించారు. జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన జూరాల, నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో పాటు ర్యాలంపాడు, సంగాల, గట్టు, చిన్నోనిపల్లి, ముచ్చోనిపల్లి రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ఏవీని వీక్షించారు. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ 1.19 టీఎంసీల సామర్థ్యం ఉండగా.. 15 టీఎంసీలకు పెంచితే జోగులాంబ గద్వాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగు, తాగునీటికి వినియోగించుకోవచ్చని మంత్రి వాకిటి శ్రీహరి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. 4 టీఎంసీల ర్యాలంపాడు రిజర్వాయర్‌లో లీకేజీలతో 2 టీఎంసీలే నిల్వ ఉంటోందని, మరమ్మతులు చేపట్టాలని, గట్టు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తుమ్మిళ్ల దిగువన నీటినిల్వ, మల్లమ్మకుంట రిజర్వాయర్ కోసం భూసేకరణ చేపట్టాలని ప్రజాప్రతినిధులు ఆయనను కోరారు. అనంతరం సోమశిలకు బయలుదేరే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎంతో కరచాలనం చేశారు. పలువుర్ని పేర్లతో పిలిచి సీఎం ఆప్యాయంగా మాట్లాడారు.
మంత్రులతో కలసి మక్తల్ నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతల పరిశీలనకు బయల్దేరి వెళ్తూ మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని ప్రాజెక్టులను హెలికాప్టర్ నుంచి సీఎం పరిశీలించారు. కృష్ణా నదీ తీరప్రాంతాలు, సంగంబండ రిజర్వాయర్, కోయిలసాగర్ ప్రాజెక్టు, కృష్ణా-భీమా నదులపై నిర్మించనున్న బ్యారేజీల ప్రాంతాలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులను వీక్షించారు. ఆయా ప్రాజెక్టులపై మంత్రులతో చర్చించారు. కృష్ణా-భీమా నదీ ప్రాంతాలను పరిశీలిస్తుండగా నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కొల్పూరు గ్రామ సమీపంలో కృష్ణానది వద్ద అఖిల పక్షనాయకులు, రైతులు జాతీయ జెండాలు ఊపుతూ హర్షం వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.