
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Southwest Monsoon: వేసవికాలం ముగిసిపోతుండగా.. వర్షాకాలం ఎంట్రీ ఇచ్చేస్తోంది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడంతో వాటి ప్రభావం తెలంగాణపై స్పష్టంగా చూపుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊరట చెందారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే అప్పుడే వరుణుడు తెలంగాణ జిల్లాలను పలకరించాడు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. కామారెడ్డి, నిర్మల్ జిల్లాతోపాటు వరంగల్ జిల్లాలోని కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షం పడింది. కామారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడడంతో అక్కడి ప్రజలు ఊరట చెందారు. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో స్థానికులు కొంత ఇబ్బందులు పడ్డారు. దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో వర్షం పడింది. బాన్సువాడలో బలమైన గాలులతో అకస్మాత్తుగా వర్షం కురిసింది. మండే ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. కొద్ది నిమిషాల్లోనే మారిన వాతావరణం ప్రజలకు ప్రజల ముఖాల్లో ఆనందం పెంచింది. నెలల తరబడి మండే ఎండతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు నేడు ప్రకృతి ఉపశమనం కలిగించింది. రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి మృతి వర్షం కారణంగా జరిగిన ప్రమాదంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామం నుంచి కామారెడ్డికి బైక్‌పై వస్తుండగా భారీ వర్షంలో సంగమేశ్వర వాసి కొమ్ము మహేశ్ (30) రోడ్డు ప్రమాదానికి గురయి మరణించాడు. బిచ్కుంద గ్రామ పంచాయతీ అధికారిగా విధులు నిర్వహించే ఆయన వర్షంలో కృష్ణ మందిర్ సమీపంలో అతడి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. నిర్మల్ జిల్లాలో.. వాతావరణ పరిస్థితులు మారిపోయి నిర్మల్ జిల్లాలో భారీ వర్షం
పడింది. జిల్లాలోని లొంకేశ్వరం, కుంటాల, నర్సాపూర్ మండలంలో పలు గ్రామాల్లో గురువారం పలు భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి చల్లటి వాతావరణం ఉండగా ప్రజలు ఊపిరి పొందారు. ఇక మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరుతో ప్రారంభమై పలు చోట్ల భారీ వర్షం కురిసింది.
వాతావరణ శాఖ సూచనలు తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది. రేపు (శుక్రవారం), ఎల్లుండి (శనివారం) రాష్ట్రంలోని చాలా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న నాలుగు రోజులలో క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 50 నుంచి 60 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.