ఎన్నో వింతలు, విశేషాలకు నిలయమైన ఆకాశంలో జూన్ 9న మరో ఖగోళ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. వీనస్, జూపిటర్ గ్రహాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా రానున్నాయి. శుక్ర (వీనస్), గురు (జూపిటర్) గ్రహాలు అరుదైన సంయోగం (కంజంక్షన్)లో దర్శనమివ్వనున్నాయి. జూన్ 9న రాత్రి ఈ గ్రహాల మధ్య దూరం కేవలం 1.5- 1.6 డిగ్రీల మేర మాత్రమే ఉన్నట్లు కనిపించనుంది. సాధారణంగా చూస్తే ఇది కొంత దూరమే అనిపించినప్పటికీ, భూమిపై ఉన్నవారికి చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఈ దూరం పౌర్ణమి చంద్రుడి వ్యాస్థారం కంటే దాదాపు మూడు రెట్లు లేదా చేతిని చాచి చూసినప్పుడు ఒక వేలు వెడల్పునకు సమానంగా ఉంటుంది. జ్యోతిషం ప్రకారం.. కర్కాటక రాశిలో గురుడు, శుక్రుడు అతి దగ్గరగా రానున్నారు. పాశ్చాత్య సంస్కృతిలో వీనస్‌ను శృంగార దేవతగా పరిగణిస్తారు. హిందూ జ్యోతిషం ప్రకారం చూసినా శుక్రుడు స్త్రీ, గురుడు పురుష గ్రహం. అందుకే ఈ గురు, శుక్ర గ్రహాల కలయికను విశ్వ చుంబనంగా అభివర్ణిస్తున్నారు. ఆకాశంలో మనకు కనిపించే ఖగోళ పదార్థాల్లో ఈ రెండు గ్రహాలు చాలా ప్రకాశవంతమైనవి. ఈ రెండు గ్రహాలు కంజెక్షన్ 8, 9 తేదీల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక, జూన్ 11 బుధుడు కూడా వీటికి దగ్గరగా వచ్చి, జూన్ 15 వరకు ఉంటాడు. ఆకాశంలో పశ్చిమ దిశలో ఈ మూడు గ్రహాల కలయికను చూడవచ్చు. బుధుడు సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటాడు కాబట్టి, గుర్తించడం కష్టం కావచ్చు. భూమిపై నుంచి చూస్తే శుక్రుడు, గురుడు దాదాపు పక్కపక్కనే ఉన్నట్లు కనిపించినప్పటికీ, వాటి మధ్య దూరం కోట్ల కిలోమీటర్ల ఉంటుంది.ఈ అద్భుతాన్ని జూన్ 9న సూర్యాస్తమయం జరిగిన అరగంట తర్వాత పశ్చిమ-వాయువ్య దిశలో చూడవచ్చు. కానీ, ఈ దృశ్యాన్ని ఎక్కువ సమయం వీక్షించలేము. ఎందుకంటే క్రమంగా హోరైజన్‌కు దగ్గరవుతూ గ్రహాలు అస్తమించిపోతాయి. అందువల్ల దాదాపు గంట పాటు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది.
.