
శివాని నాగారం (Shivani Nagaram) అచ్చ తెలుగు అమ్మాయి. తెలుగులో సుహాస్ సరసన రెండు చిత్రాల్లో నటించింది. అలాగే గతేడాది విడుదలై మంచి హిట్ అయిన “లిటిల్ హార్ట్స్” (Little Hearts)లో కూడా నటించింది. ఆ సినిమా తర్వాత ఆమె తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తాయని భావించింది. కానీ మన వాళ్ళు తెలుగు హీరోయిన్లకు అంతగా అవకాశాలు ఇవ్వరు కదా. అందుకే ఈ భామ ఇప్పుడు తమిళ చిత్ర సీమపై ఫోకస్ పెట్టింది. యువ దర్శకుడు అభీషన్ జీవింత్ కొత్త చిత్రం ప్రకటించాడు. అతను ఇటీవలే హీరోగా “విత్ లవ్” అనే చిత్రంలో నటించి హిట్ కొట్టాడు. ఇప్పుడు హీరోగా మరో కొత్త సినిమా ప్రారంభించాడు. ఇందులో కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. గౌతమ్ శివరామన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో శివానికి ఛాన్స్ దొరికింది. యోగ లక్ష్మి మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఐతే, శివానికి ఇది హీరోయిన్ గా తమిళంలో మంచి అరగేంట్రం అయ్యేలా ఉంది. పలువురు తెలుగు అమ్మాయిలు తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టి రాణించారు. బిందు మాధవి, శ్రీదివ్య, ఆనంది అలాగే కెరీర్ తీర్చిదిద్దుకున్నారు. ఇటీవల శ్రీ గౌరీ ప్రియ, శాన్వి మేఘన, మానస చౌదరి అలాగే తమిళంలో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు వారి బాటలోనే శివాని వెళ్తోంది
.