
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ ‘గ్రీక్ గాడ్’ హృతిక్ రోషన్ తన అద్భుతమైన నటన, డ్యాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
కానీ, ఆయన తన జీవితంలో రెండు దశాబ్దాల పాటు ఓ నిశ్శబ్ద పోరాటం చేశారన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. హృతిక్‌కు చిన్నప్పుడు నత్తి సమస్య ఉండేది. నటుడు కావాలన్న ఆయన కలకు అది పెద్ద అడ్డంకిగా మారింది. ఆ సమస్య వల్ల ఒకప్పుడు వైద్యుల నుంచి నిరాశపరిచే మాటలు వినాల్సి వచ్చేది. గతంలో ఫరా ఖాన్ ‘తేరే మేరే బీచ్ మే’ కార్యక్రమంలో ఆయన ఈ చేదు సంఘటన గురించి పంచుకున్నారు.
‘నువ్వు నటుడివి కాలేవు.. నటన వైపు వెళ్లొద్దు. నీకింకా 21 ఏళ్లే, వేరేదైనా వృత్తిని ఎంచుకో’ అని ఒక డాక్టర్ తనకు సలహా ఇచ్చినట్లు హృతిక్ గుర్తుచేసుకున్నారు. ‘‘మాట్లాడటం మొదలుపెట్టగానే ఒక్కసారిగా ఆగిపోతాం. ఎందుకు అలా జరుగుతుందో అర్థం కాదు. బొటనవేలి నుంచి తల వరకు వణికిపోతాం. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అందరూ మనల్నే వింతగా చూస్తున్నారన్న భయం ఉంటుంది. ఆ పరిస్థితి చాలా నరకంలా అనిపిస్తుంది. ఆ నత్తి సమస్యతో అప్పుడు నేను నటుడిని కావాలనుకుంటున్నానని కూడా ఎవ్వరికీ చెప్పలేకపోయేవాడిని’ అని తెలిపారు.
అయితే, హృతిక్ తన లోపాన్ని చూసి భయపడలేదు. స్పీచ్ థెరపిస్టుల పర్యవేక్షణలో ఎంతో శ్రమించారు. పట్టుదలగా న్యూస్‌పేపర్లు చదవడం, వాయిస్ మాడ్యులేషన్, శ్వాస వ్యాయామాలు వంటి శిక్షణలు తీసుకుని నత్తిని పూర్తిగా జయించారు. బాలీవుడ్ అగ్రకథానాయకుడిగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక సినిమాలతో బిజీగా ఉండే హృతిక్ రోషన్.. త్వరలో ఓటీటీ ప్రపంచంలోకి నిర్మాతగా అడుగుపెట్టనున్నారు. ఆయన నిర్మిస్తున్న తాజా వెబ్ సిరీస్ పేరు ‘స్టార్మ్’. దీనికి అజిత్‌పాల్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కొన్నేళ్ల క్రితం తన అభిమాని అన్న ‘అయ్యగారు’ అనే మాట స్టిక్కర్లా అంటుకుపోయిందని నటుడు అక్కినేని అఖిల్ అన్నారు.