
సొంత పార్టీ స్థాపనతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించాలనుకున్న మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని బిగ్ షాక్ ఇచ్చింది.
'తెలంగాణ రక్షణ సేన (TRS)' పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆమె చేసుకున్న దరఖాస్తుపై ఏకంగా వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని సీఈసీ వెల్లడించింది. పార్టీ పేరు మార్చాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ నమోదు ప్రక్రియ ముందుకు సాగాలంటే 15 రోజుల్లోగా మరో మూడు ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించాలని స్పష్టం చేస్తూ కవితకు అధికారికంగా లేఖ రాసింది. నిర్ణీత గడువులోగా కొత్త పేర్లు పంపకపోతే, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును క్లోజ్ చేస్తామని సీఈసీ ఆ లేఖలో కఠినంగా హెచ్చరించింది.
ఈసీ పంపిన లేఖపై కల్వకుంట్ల కవిత అత్యంత ఘాటుగా స్పందించారు. ఎన్నికల సంఘం లేఖలో పేర్కొన్న అభ్యంతరాలకు తాము ఇప్పటికే రాతపూర్వక సమాధానాలు ఇచ్చామని తెలిపారు. ఈసీ కోరినట్లుగా ప్రత్యామ్నాయంగా కొత్త పేర్లను పంపే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు. ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుపైనే తాము ముందుకు వెళ్తామని, అవసరమైతే ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంపై కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయడానికైనా సిద్ధమని కవిత స్పష్టం చేశారు.
అయితే, ఆ తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలోనే (ఏప్రిల్ 28న) ఈ పేరును 'తెలంగాణ రక్షణ సేన'గా మారుస్తూ, ఈ పేరుపై నెల రోజుల్లోగా ప్రజల నుంచి అభ్యంతరాలు కోరుతూ పత్రికల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. మూడు రోజుల్లోనే 'రాష్ట్ర సేన' కాస్త 'రక్షణ సేన'గా ఎందుకు మారిందనే దానిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ప్రస్తుతం ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతోనే కవిత కేడర్‌ను సమాయత్తం చేస్తూ ప్రజా క్షేత్రంలో పోరాటాలు నిర్వహిస్తుండగా... ఇప్పుడు ఏకంగా వేల సంఖ్యలో అభ్యంతరాలు రావడం, ఈ ఈసీ స్పందన నేపథ్యంలో ఈ 'TRS' పేరు కవితకు దక్కుతుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.