
Rao Bahadur Review || చిత్రం: రావు బహదూర్; నటీనటులు: సత్యదేవ్, దీపా థామస్, వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్, ప్రణయ్, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు; సంగీతం: స్మరణ్ సాయి; ఛాయాగ్రహణం:...
Rao Bahadur Review || చిత్రం: రావు బహదూర్; నటీనటులు: సత్యదేవ్, దీపా థామస్, వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్, ప్రణయ్, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు; సంగీతం: స్మరణ్ సాయి; ఛాయాగ్రహణం: కార్తిక్ పర్మార్; రచన, దర్శకత్వం: వెంకటేశ్ మహా; నిర్మాతలు: గోపాలకృష్ణ రెడ్డి చింతా, శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి; సమర్పణ: మహేశ్‌బాబు, నమ్రత; విడుదల తేదీ: 03-07-2026
‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు వెంకటేశ్ మహా. ఇప్పుడాయన సత్యదేవ్‌తో కలిసి చేసిన రెండో సినిమా ‘రావు బహదూర్’ (Rao Bahadur). దీనికి మహేశ్‌బాబు స్వయంగా సమర్పకుడిగా వ్యవహరించడం.. ఇందులో సత్యదేవ్ పలు భిన్న గెటప్పుల్లో కనిపించనుండటం.. టీజర్, ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలేర్పడ్డాయి. మరి ఈ చిత్ర కథేంటి? ప్రేక్షకుల్ని మెప్పించిందా?
1968 - 1991 మధ్య కాలంలో సాగే కథ ఇది. రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్) ఓ రాజవంశీకుడు. కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతూ జీవిత చరమాంకంలో ఉంటాడు. డాక్టర్లు తను కొన్ని నెలలకు మించి బతకడని చెప్పినప్పటికీ.. వాళ్ల అంచనాల్ని తలకిందులు చేస్తూ నిక్షేపంగా జీవిస్తుంటాడు. అయితే, తను తీవ్రమైన మానసిక రుగ్మతలతో సతమతమవుతుంటాడు. ముఖ్యంగా అతన్ని ఓ అనుమానం పెనుభూతంలా పట్టిపీడిస్తుంటుంది. దాన్ని తీర్చితే చాలు.. సంతోషంగా ప్రాణం వదిలేస్తానని తన మిత్రుడు, వ్యక్తిగత వైద్యుడు ఆచారి (వికాస్ ముప్పాల) దగ్గర మాట తీసుకుంటాడు. మరి తనకున్న ఆ అనుమానమేంటి? దానివల్ల తన చుట్టూ ఉన్న వాళ్లని ఎన్ని రకాలుగా ముప్పుతిప్పలు పెట్టాడు? అసలు రామప్ప గతమేంటి? రేణుక (దీపా థామస్)తో ప్రేమ, పెళ్లి ప్రయాణం ఎలా సాగింది? ఆమెకి దూరంగా తను ఒంటరిగా జీవించడానికి వెనకున్న కారణమేంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఇదొక విభిన్నమైన సైకలాజికల్ డ్రామా సినిమా. జీవిత చరమాంకంలో ఉన్న ఓ రాజవంశీకుడు తనకున్న అనుమానం అనే జబ్బుతో చుట్టూ ఉన్న వాళ్లని సైకలాజికల్‌గా ఆడుకుంటూ తన కోరికని ఎలా నెరవెర్చుకున్నాడన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. పైకిది ఓ రాజవంశ కథలా కనిపించినా.. అంతర్లీనంగా సమాజంలో తరతరాలుగా గూడుకట్టుకుపోయిన వివక్షాపూరిత వ్యక్తిత్వాల గురించి చర్చిస్తుంది. ప్రధానంగా కుల వ్యవస్థ, రంగు, రక్తసంబంధాలు, వారసత్వ హోదాపై ఉన్న పిచ్చిని ఈ చిత్రం బలంగా ప్రశ్నిస్తుంది. కానీ, ఈ సినిమాతో దర్శకుడు వెంకటేశ్ మహా చెప్పాలనుకున్న విషయం ఆలోచనరేకెత్తించేదే అయినప్పటికీ.. దాన్ని ఆద్యంతం జనరంజకంగా తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డారు. ఓ ఫొటో ఫ్రేమ్ నుంచి బయటకొచ్చిన పిల్లాడిన ఊడలు తరుముకుంటూ రావడం.. తనని తిరిగి సమాధిలో బంధించడం.. కట్ చేస్తే మంచం పట్టిన స్థితిలో వృద్ధ పాత్రలో హీరోని పరిచయం చేయడం.. ఇలా ఆరంభ సన్నివేశాలు ఏదో కొత్త కథని, కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నామన్న ఆసక్తిని కలిగించేలా చేస్తాయి. కానీ, ఆ తర్వాత నుంచి సినిమాలో వేగం పూర్తిగా మందగిస్తుంది. ప్రేక్షకుడికి అసలు కథేంటన్నది అంతుచిక్కడానికి విరామం వరకు వేచి చూడాల్సి వస్తుంది.
భువనాలయ ప్రపంచం.. అందులోని రావు బహదూర్ జీవితం.. తన గతం.. రేణుకతో ప్రేమాయణం అన్నీ సీరియల్లా నెమ్మదిగా సాగిపోతుంటాయి. హీరో ఎప్పుడైతే తన అనుమానం తీర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడో అక్కడి నుంచే కథలో సంఘర్షణ రెట్టింపవుతుంది. ఈక్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచేలా ఉంటాయి. ఇక సెకండాఫ్ మొదలైనప్పటి నుంచి కథ కాస్త గాడిన పడిన అనుభూతి కలుగుతుంది. సినిమా వేగం పుంజుకుంటుంది. హీరో గతం.. చిన్న కొడుకుపై వివక్ష చూపించడానికి వెనకున్న కారణం.. దాని చుట్టూ నడిపిన డ్రామా అన్నీ ఆకట్టుకుంటాయి. ఇక ఈ కథలోకి పోలీస్ పాత్ర ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తుందో.. అక్కడి నుంచి సినిమా ఇంకాస్త ఆసక్తికరంగా మారుతుంది. ఇక ప్రీక్లైమాక్స్ ఊహలకి అందేలా ఉన్నా.. ఓ చక్కటి ట్విస్ట్‌తో పతాక ఘట్టాల్ని తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది.
సత్యదేవ్ నటనే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. బహుముఖ కోణాలున్న రావు బహదూర్ పాత్రలో ఆయన ఒదిగిన తీరు.. యుక్తవయసు నుంచి వృద్ధుడి వరకు వరకు వివిధ వయసులకు తగ్గట్లుగా తనని తాను తెరపై ఆవిష్కరించుకున్న తీరు.. కనబర్చిన అభినయం.. పలికించిన భావోద్వేగాలు అన్నీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ముఖ్యంగా వృద్ధుడిగా ఆయన డైలాగ్ డెలివరీ.. అప్పటికప్పుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తించే తీరు అన్నీ గమ్మత్తుగా అనిపిస్తాయి. రేణుక పాత్రలో దీపా థామస్ తెరపై అందంగా కనిపించింది. ప్రధమార్ధంలో ఆమె పాత్ర ప్రభావం చూపించినా.. ద్వితీయార్ధంలో ఆమె అతిథి పాత్రలా మిగిలిపోయింది. ఆచారి పాత్రలో వికాస్ నటన ఆకట్టుకుంటుంది. పనిమనిషి పాత్ర అక్కడక్కడా నవ్విస్తుంది. దర్శకుడు వెంకటేశ్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సరికొత్త రీతిలో తెరపై ఆవిష్కరించాలని ప్రయత్నించినప్పటికీ.. అది పూర్తి స్థాయిలో ఫలించలేదు. ఈ సినిమా కోసం తను సృష్టించిన వరల్డ్ సెటప్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది. ప్రేక్షకుల్ని 1960-1990ల కాలంలో కూర్చోబెట్టేందుకు ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. సంగీతం, నేపథ్య సంగీతం కథకి తగ్గట్లుగా కుదిరింది. విజువల్స్ చాలా సహజంగా ఆకట్టుకునేలా ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.