
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ అల్లుడు, హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ కుమారుడైన మోసిన్ ఖాన్‌పై హైదరాబాద్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. రూ.
50 లక్షలు మోసం చేశారంటూ టాలీవుడ్ సినీ నిర్మాత వెంకట అనీశ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతానికి చెందిన నిర్మాత వెంకట అనీశ్ రెడ్డి ప్రస్తుతం ‘మహారాగ్ని’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన ఫైనాన్షియర్ల కోసం అన్వేషిస్తున్న తరుణంలో మోసిన్ ఖాన్, తబ్రేజ్ అనే వ్యక్తులు పరిచయమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ‘సన్‌లైట్’ కార్యాలయంలో జరిగిన భేటీలో... తాము సినిమాకు అవసరమైన ఫైనాన్స్ సమకూరుస్తామని నమ్మబలికారు. అయితే, ఆ ఫైనాన్స్ ఇప్పించాలంటే తమకు ముందుగా రూ.50 లక్షలు కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి మాటలను నిజమని నమ్మిన అనీశ్ రెడ్డి అడిగిన మొత్తాన్ని చెల్లించారు.
డబ్బులు తీసుకున్న తర్వాత రోజులు గడుస్తున్నా మోసిన్ ఖాన్, తబ్రేజ్ ల నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన అనీశ్ రెడ్డి... జూబ్లీహిల్స్ సన్‌లైట్ ఆఫీస్‌కు వెళ్లి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీశారు. ఆ సమయంలో వారు డబ్బులు ఇవ్వకపోగా, బౌన్సర్లతో అనీష్‌పై భౌతిక దాడి చేయించి అక్కడి నుంచి గెంటివేశారు. ఈ ఘటనపై బాధితుడు అనీశ్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.