
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి, ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిత ఆర్. రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.ఇటీవల నిర్వహించిన డీఎంకే బహిరంగ సభలో రాధాకృష్ణన్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దివంగత కరుణానిధి జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభలో, సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ను, అసెంబ్లీలో ఆయన ప్రవర్తనను ఎగతాళి చేస్తూ రాధాకృష్ణన్ మాట్లాడారు. దీనిపై అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే) నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.శుక్రవారం ఉదయం హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే, స్థానిక టౌన్ పంచాయతీలో రికార్డులు పరిశీలిస్తున్న రాధాకృష్ణన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టును డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నేతలను అణచివేస్తోందని ఆమె ఆరోపించారు.