తమిళ నటుడు , హీరో అజిత్ కుమార్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హీరో అజిత్ తల్లి మోహిని మణి శనివారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. అజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు
. "అజిత్ మాతృమూర్త మోహిని మణి కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నా. మోహిని మణి గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగపు బాధ నుంచి అజిత్ గారు త్వరగా కోలుకోవాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." అంటూ పవన్ కళ్యాణ్ తరుఫున డిప్యూటీ సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. 85 ఏళ్ల మోహిని గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తల్లి మరణించే సమయానికి అజిత్ దుబాయ్‌లో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే అజిత్ దుబాయ్ నుంచి బయల్దేరి చెన్నైకు చేరుకున్నారు. అజిత్ కుమార్ తండ్రి కూడా మూడు సంవత్సరాల కిందట కన్నుమూశారు. మోహిని మణికి అజిత్‌తో పాటు అనూప్ , అనిల్ కుమార్ అనే మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. మరోవైపు అజిత్ తల్లి మరణించిన సంగతి తెలుసుకుని పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తు్న్నారు. మోహిని మణి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం విజయ్ స్వయంగా అజిత్ ఇంటికి వెళ్లారు. సీఎం విజయ్‌తో పాటుగా హీరోయిన్ త్రిష కూడా అజిత్ ఇంటికి వెళ్లారు. వీరిద్దరూ కలిసి అజిత్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత త్రిషతో కలిసి కనిపించటం ఇదే తొలిసారి. కారులో అజిత్ నివాసానికి చేరుకున్న ఇద్దరూ.. మోహిని మణి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం అజిత్ కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు అజిత్, విజయ్ తమిళ సిని రంగంలో ఒకప్పుడు రైవల్స్‌గా పేరొందారు.