తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఇటీవల టీడీపీ మహానాడు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహానాడులో ప్రసంగించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత బక్కని నర్సింలు.. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తెలంగాణలోని నాయకులు, మేధావులు.. బక్కని నర్సింలు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. అయితే ఇది తీవ్ర దుమారం రేపుతుండగా.. తాజాగా టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. బక్కని నర్సింలు మహానాడులో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుపట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. ఎంతో చరిత్ర, నేపథ్యం ఉన్న తెలంగాణ లాంటి ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ కీలక నేతలతో శనివారం రోజున పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. తెలుగువారు ఎక్కడున్నా తెలుగుజాతి ఒక్కటేనని తేల్చి చెప్పారు. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా నాయకులు మాట్లాడకూడదని చంద్రబాబు కాస్త స్ట్రాంగ్‌గానే తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని చంద్రబాబు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ తెలంగాణలో బలమైన క్యాడర్ ఉందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే తెలంగాణలో సామాజిక న్యాయం, అభివృద్ధికి బాటలు పడ్డాయని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.అసలు తెలంగాణ అనే పదమే డిక్షనరీలో ఎక్కడా లేదని మహానాడులో బక్కని నర్సింలు చేసిన వ్యాఖ్యలు మరోసారి తెలంగాణకు అవమానం కల్గించేలా ఉన్నాయని తెలంగాణ నేతలు మండిపడ్డారు. డిక్షనరీలో ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయని.. తెలంగాణకు డిక్షనరీలో పదాలే లేవని బక్కని నర్సింలు వ్యాఖ్యనించారు
. కానీ కొందరు స్వార్థంతో ప్రాంతీయ బేధాలు తీసుకువచ్చి తెలంగాణలో చాలా మంది కష్టపడేవారి జీవితాల్లో మన్నుపోశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పటేల్, పట్వారీ, జోగిని వ్యవస్థ ఉండేదని.. వెట్టిచాకిరి కూడా ఉండేదని.. ఎన్టీఆర్ పుణ్యమా అని.. వాటన్నింటినీ రద్దు చేసిన తర్వాతే తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని బక్కని నర్సింలు మాట్లాడారు.