
చదివిన ఆర్థికశాస్త్రం కంటే సమాజమే ఎక్కువ నేర్పింది ప్రజల జీవితాల్లో మార్పే అభివృద్ధికి కొలమానం అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా ఆర్థిక గణాంకాల విశ్లేషణ గూడూరులో తాను పెన్షన్ పంపిణీ చేసిన తులశమ్మ,...
చదివిన ఆర్థికశాస్త్రం కంటే సమాజమే ఎక్కువ నేర్పింది ప్రజల జీవితాల్లో మార్పే అభివృద్ధికి కొలమానం అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా ఆర్థిక గణాంకాల విశ్లేషణ గూడూరులో తాను పెన్షన్ పంపిణీ చేసిన తులశమ్మ, పద్మమ్మ కుటుంబాల స్థితిగతులను వర్క్ షాప్‌లో వివరించిన సీఎం తాను ఆర్థిక శాస్త్రం చదివినా... పుస్తకాల కంటే సమాజం, ప్రజల నుంచే ఎక్కువ నేర్చుకున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక వృద్ధి గణాంకాలు పెరగడం మాత్రమే కాకుండా, ఆ వృద్ధి పేదల జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తోందన్నదే ప్రభుత్వానికి అసలైన కొలమానమని స్పష్టం చేశారు. జీఎస్డీపీ (GSDP), సీఏజీఆర్ (CAGR) వంటి ఆర్థిక సూచికలను విశ్లేషిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ పేరుతో జరిగిన రాష్ట్రస్థాయి రెండు రోజుల వర్క్‌షాప్‌లో గురువారం సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. డేటా ఆధారిత పాలన, సాంకేతికత, సమర్థవంతమైన పరిపాలన ద్వారానే రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలమని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా విజన్-2020 రూపొందించినప్పుడు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి పనిచేశామని గుర్తు చేశారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కూడా దేశానికి విజన్ డాక్యుమెంట్ అవసరమని భావించారని చెప్పారు. ఐటీ విప్లవం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిందని, సేవల రంగంలో విప్లవాన్ని అందిపుచ్చుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని అప్పుడే విశ్వసించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం డేటానే సంపదగా మారిందని, భవిష్యత్‌లో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించడం ఎంత ముఖ్యమో, రాష్ట్రంలో సంపద సృష్టించేందుకు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం కూడా అంతే కీలకమన్నారు. అందుకే స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో ప్రైవేట్ పెట్టుబడులను ప్రధాన అంశంగా చేరుస్తున్నామని తెలిపారు. అన్ని శాఖలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా అనుసంధానం చేయడానికి డేటా లేక్ రూపొందిస్తున్నామని, ప్రభుత్వ శాఖలన్నింటి డేటాను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నామని వివరించారు. ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు హెల్త్ రికార్డులను పూర్తిగా డిజిటలైజ్ చేసి సంజీవని ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ రూపొందించామని చెప్పారు. సమాజానికి తిరిగి కొంత ఇవ్వాలి... పేద-ధనికుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి తెలిపారు. సమాజం ద్వారా ఎదిగిన వారు తిరిగి సమాజానికి అండగా నిలవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వర్క్‌షాప్‌లో పేదల జీవన ప్రమాణాలపై మాట్లాడిన ముఖ్యమంత్రి, తాను స్వయంగా పెన్షన్ పంపిణీ చేసిన తులశమ్మ, పద్మమ్మ కుటుంబాల పరిస్థితులను ఉదహరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డ్వాక్రా రుణాల ద్వారా ఆ కుటుంబాల జీవితాల్లో వచ్చిన మార్పును సభికులకు వివరించారు. జీఎస్డీపీ, సీఏజీఆర్ వంటి గణాంకాలను విశ్లేషించడం మాత్రమే కాదు, వాటి ప్రభావం ప్రజల జీవితాల్లో ఎలా ప్రతిఫలిస్తోందో అంచనా వేస్తూ పాలన సాగిస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంలోనే తాను ఆర్థిక శాస్త్రం చదివానని... కానీ పుస్తకాల కంటే సమాజం, ప్రజల నుంచే ఎక్కువ నేర్చుకున్నానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల అసలు లక్ష్యం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమేనని సీఎం స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనకు కేవలం గణాంకాలు సరిపోవని, ప్రతి కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా ఎదగాల్సిందేనని పేర్కొన్నారు. అనంతరం సభికులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... తాను త్వరగా సంతృప్తి చెందే వ్యక్తిని కాదన్నారు. సంతృప్తి చెందితే అదే స్థితిలో ఆగిపోతామని, అందుకే ప్రజల కోసం నిరంతరం కొత్త విధానాలను అన్వేషిస్తూ ముందుకు సాగాలని సూచించారు. టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు, ఈ రంగంలో సొంత వ్యవస్థలను కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒకే లక్ష్యంతో కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దేశం నాకేమిచ్చింది అనే దానికంటే... దేశానికి మనమేమి చేశామనే దృక్పథంతో పనిచేయాలి అని ముఖ్యమంత్రి కోరారు. భవిష్యత్ సాంకేతికతల వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని, త్వరలోనే అమరావతిలో క్వాంటం కంప్యూటర్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. క్వాంటం కంప్యూటర్లను తయారు చేసే సామర్థ్యాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ సొంతం చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. తాను నిత్య విద్యార్థిగా ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి... ప్రజల జీవితాల మెరుగుదలకు చక్కటి సలహాలు ఇవ్వాలని వర్క్ షాప్ కు హాజరైన వివిధ రంగాల్లోని నిపుణులు, ఆర్థిక వేత్తలను సీఎం కోరారు. ఏపీ విధానాలు భేష్... రెండు రోజుల వర్క్ షాప్ సందర్భంగా వివిధ అంశాలపై ప్యానెల్ డిస్కషన్లు జరిగాయి. దీంట్లో భాగంగా కేంద్ర స్టాటస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్, భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహదారు డాక్టర్ వి. అనంత నాగేశ్వరన్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఆర్. బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ కె.వి. రాజు, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ లతో కూడిన ప్యానెల్ డిస్కషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు. సభికుల మధ్యే కూర్చొని ప్యానెల్ చర్చను సీఎం ఆసక్తిగా ఆలకించారు. ఈ సందర్భంగా ఏపీలో అమలవుతున్న వినూత్న కార్యక్రమాలను నిపుణులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. నియోజకవర్గాల వారీ విజన్ ప్లాన్, పీ4 కార్యక్రమం, గ్రామస్థాయిలో డేటా సేకరణ, పాలనలో ఏఐ వినియోగం వంటి అంశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న చొరవను ప్రశంసించారు. పీ4, నియోజకవర్గాల వారీ విజన్ ప్లాన్ వంటి కార్యక్రమాలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేవని, వీటిని జాతీయ స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, హెచ్వోడీలు, జిల్లా, మండల స్థాయి ఉద్యోగులు, వివిధ యూనివర్శిటీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.