
భారతీయ కళల్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్న మహిళలు ఎందరో. వారిలో బెంగళూరుకు చెందిన డాక్టర్ రాధికా బాలకృష్ణన్ ఒకరు. కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్య శైలుల్ని జోడించి..
దేశవిదేశ సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటున్నారామె.
భారతీయ కళల్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్న మహిళలు ఎందరో. వారిలో బెంగళూరుకు చెందిన డాక్టర్ రాధికా బాలకృష్ణన్ ఒకరు. కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్య శైలుల్ని జోడించి.. దేశవిదేశ సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటున్నారామె. కేవలం ప్రదర్శనలతోనే ఆగిపోకుండా.. పలు సంగీత పాఠశాలల్లో టీచర్‌గా, ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ యువతకు సంగీత పాఠాలు నేర్పుతున్నారు. ఇలా భారతీయ శాస్త్రీయ సంగీత రంగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఇటీవలే యూకేలోని Royal Birmingham Conservatoire (ఆర్బీసీ) నుంచి ఆమె ‘గౌరవ ఫెలోషిప్’ను అందుకున్నారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి కర్ణాటక గాయనిగా నిలిచారు రాధిక. ఈ నేపథ్యంలో ఆమె సంగీత ప్రయాణం గురించి తెలుసుకుందాం..
పదేళ్ల వయసు నుంచే కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు రాధిక.
‘సంగీతమే నా ప్రపంచంగా పెరిగా. చిన్నతనంలో ఎప్పుడూ పాటలు పాడుతూనే ఉండేదాన్ని. ఏదైనా కొత్త సినిమా పాట విడుదలైతే చాలు.. పట్టుబట్టి నేర్చుకొని మరీ పాడేదాన్ని. ఇలా సంగీతం పట్ల నాకున్న మక్కువను మా నాన్న గుర్తించారు. ఆయనకూ శాస్త్రీయ సంగీతమంటే ప్రాణం. దాంతో నన్ను ఈ దిశగా ప్రోత్సహించారు. మా కుటుంబం మైసూర్‌కి మారాక అక్కడ హెచ్ఎన్ రాజలక్ష్మి వద్ద కర్ణాటక సంగీత పాఠాలు నేర్చుకున్నా. మైసూర్ యూనివర్సిటీలో లలిత కళల్లో మాస్టర్స్ పూర్తిచేశా. ఇందులో భాగంగా నాటకాలు, భరతనాట్యం, కర్ణాటక సంగీతం.. ఈ మూడింటినీ ప్రధాన సబ్జెక్టులుగా ఎంచుకున్నా. అయితే ఒకానొక దశలో వీటన్నింటినీ సమన్వయం చేయడం కష్టంగా అనిపించింది. పైగా ఈ అంశాల్లో పోటీ కూడా ఎక్కువే. అయినా అన్నీ తట్టుకొని ముందుకు సాగా.. మూడు సబ్జెక్టుల్లోనూ బంగారు పతకాలు సాధించా..’ అంటోన్న రాధిక.. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పూర్తిచేశారు. డాక్టర్ ఆర్ఎన్ శ్రీలత మార్గనిర్దేశనంలో ‘భారత శాస్త్రీయ సంగీతం’లో లోతైన పరిశోధనలు చేశారు.
త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు పాడడంలో రాధిక దిట్ట. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో 15 ఏళ్లకు పైగా అనుభవం గడించిన ఆమె.. సంప్రదాయ సంగీతానికి పాశ్చాత్య శైలుల్ని జోడించి దేశవిదేశాల్లో పలు ప్రదర్శనలిచ్చారు. మంగళూరులో జరిగిన ఆయా ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ‘మహిళా శాస్త్రీయ సంగీత బృందా’నికి నాయకత్వం వహించి.. తన ప్రతిభతో ఎంతోమంది దృష్టిని ఆకర్షించారు. లండన్, బర్మింగ్‌హామ్ నగరాల్లో సంగీత కచేరీలు చేస్తూ కర్ణాటక సంగీతంలోని మాధుర్యాన్ని విదేశీయులకూ పంచారు. అక్కడి ఆర్బీసీలోనూ పలు ప్రదర్శనలిచ్చారామె. ఇక్కడితోనే ఆగిపోకుండా.. తన సంగీత నైపుణ్యాల్ని యువతకు పంచాలనుకున్నారు రాధిక.
⚛ 2023లో ‘బర్మింగ్‌హామ్ సిటీ యూనివర్సిటీ’లోని ‘ఇండియన్ స్టడీస్’ విభాగానికి చెందిన ‘ఐసీసీఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్)’కి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో అక్కడి విద్యార్థులకు సంగీత పాఠాలు బోధించడంతో పాటు ప్రత్యేక ప్రదర్శనలూ ఇచ్చారు.
⚛ ప్రస్తుతం ‘శంకర్ మహదేవన్ అకాడమీ’లో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ.. ఇక్కడి విద్యార్థులకు సంగీత పాఠాలు నేర్పుతున్నారు. గతంలో ఈ మ్యూజిక్ స్కూల్లో సంగీత పాఠ్య ప్రణాళికను తయారుచేయడంలోనూ తన వంతు పాత్ర పోషించారు రాధిక.
⚛ అంతేకాదు.. యూకేలోని ప్రతిష్టాత్మక సంగీత పాఠశాల ఆర్బీసీకి విజిటింగ్ ప్రొఫెసర్‌గా, ఆర్టిస్ట్‌గా వ్యవహరిస్తున్నారామె.
ఇలా భారతీయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ తీసుకొచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు రాధిక. ఇందుకు గుర్తింపుగానే ఆర్బీసీ నుంచి ‘గౌరవ ఫెలోషిప్’ను అందుకున్నారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి కర్ణాటక గాయనిగా గుర్తింపు పొందారు.
‘ఈ ఫెలోషిప్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే తరాల వారిని గొప్ప సంగీత కళాకారులుగా తీర్చిదిద్దే దిశగా నేను చేస్తున్న ప్రయత్నానికి దక్కిన గొప్ప గౌరవమిది. సంగీతానికి భౌగోళిక హద్దులుండవన్న విషయం నేను ఎప్పుడూ నమ్ముతాను. ఈ ఫెలోషిప్తో అది నిజమైంది..’ అంటూ తన మనసులోని మాటల్ని పంచుకున్నారు రాధిక.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.