
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది.
ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది.వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒడిశా-బెంగాల్ తీర ప్రాంతాల్లో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న రెండు, మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు.రేపు (జూలై 3) శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అల్పపీడన కదలికలను నిరంతరం గమనిస్తున్నామని, ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని తెలిపారు.