
సీనియర్ నటుడు జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'వదలా'. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు గురువారం వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. అకెళ్ల వి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకునే దంపతుల చుట్టూ తిరిగే కథ ఇది. అయితే, వారి కుటుంబానికి దగ్గరగా ఉండే ఓ యువతి... ఆ దంపతుల్లో భర్తపై వ్యామోహం పెంచుకుంటుంది. అతడిని దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడుతుంది. ఈ ముక్కోణపు ప్రేమకథలో ఉత్కంఠభరితమైన అంశాలు సినిమాపై అంచనాలను పెంచాయి.ఈ చిత్రంలో జగపతి బాబు తన వయసుకు తగ్గ, సౌమ్యుడైన భర్త పాత్రలో ఒదిగిపోయినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత తెరపై కనిపించిన లయ, ఆయనకు భార్యగా చక్కగా సరిపోయారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇక, హృతిక శ్రీనివాస్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుండగా, రవివర్మ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై కిశోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కార్తీక్ కొడకండ్ల నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.