ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టుకూ సాధ్యం కావడం లేదని, భారత్ కేవలం అత్యుత్తమ జట్టే కాకుండా మిగతా జట్లతో పోలిస్తే ఎంతో ముందుందని పాకిస్థాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్...
ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టుకూ సాధ్యం కావడం లేదని, భారత్ కేవలం అత్యుత్తమ జట్టే కాకుండా మిగతా జట్లతో పోలిస్తే ఎంతో ముందుందని పాకిస్థాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాతో తమ జట్టు వైఫల్యాలపై ఆయన నిష్పక్షపాతంగా స్పందించాడు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హెస్సన్ మాట్లాడుతూ, "గత ఏడాది ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో తప్ప, మిగిలిన అన్నిమ్యాచ్ల్లోనూ మేము విజయం సాధించాం. వాస్తవానికి ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి జట్టు భారత్‌ను ఓడించడానికి ఇబ్బంది పడుతోంది. ఇది కేవలం పాకిస్థాన్‌కు మాత్రమే పరిమితమైన అంశం కాదు" అని పేర్కొన్నాడు.పాకిస్థాన్ జట్టు ప్రదర్శనను తరచూ భారత్‌తో వచ్చే ఫలితాల ఆధారంగానే అంచనా వేస్తున్నారని హెస్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. "ప్రస్తుతానికి భారత్ అత్యుత్తమ జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఇతర జట్ల కంటే చాలా ముందున్నారు" అని స్పష్టం చేశాడు.ఈ ఏడాది ఫిబ్రవరిలో కొలంబోలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2025లో హెస్సన్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లలో పాకిస్థాన్ మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, పూర్తి స్థాయి భారత జట్టుపై విజయం సాధించలేకపోయింది. 2027 వన్డే ప్రపంచకప్ కోసం జట్టును సిద్ధం చేస్తున్నామని, ఆటగాళ్లలో మరింత పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని హెస్సన్ పేర్కొన్నాడు.