
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
India Vs England Playing 11: ఐర్లాండ్‌తో సిరీస్‌లో విఫలమైన టీమిండియా.. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా ఆకట్టుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. బుధవారం చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో కొందరి ప్రదర్శన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో బుల్లెట్ రైళ్లలా దూసుకుపోయిన ఇద్దరు స్టార్ హిట్టర్లు.. శ్రేయస్ అయ్యర్ సారథ్యం చేపట్టగానే ఒక్కసారిగా ప్యాసింజర్ ట్రైన్‌లా నత్తనడక బ్యాటింగ్‌తో నిరాశపరుస్తున్నారు. వారే.. సంజూ శాంసన్, తిలక్ వర్మ.
తొలి టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రేయాస్ సేన.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (59), శివమ్ దూబే (42) మెరుపులు మెరిపించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (68) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేయగా.. తిలక్ వర్మ 13 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశారు.
టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన ఈ ఇద్దరు స్టార్ బ్యాట్స్మెన్లు.. ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌లోనే కాదు.. దీనికి ముందు జరిగిన ఐర్లాండ్ సిరీస్‌లోనూ విఫలమయ్యారు. ఐర్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో సంజూ 4 బంతుల్లో 5 రన్స్ చేయగా.. రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఇక తిలక్ వర్మ పరిస్థితి చూస్తే టీ20 మ్యాచ్‌ను వన్డే తరహాలో ఆడాడు. ఐర్లాండ్‌పై మొదటి మ్యాచ్‌లో 21 బంతుల్లో 19 పరుగులు చేసిన తిలక్.. రెండో మ్యాచ్‌లో 46 బంతులు తిని 55 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో అతని స్ట్రైక్ రేట్ కేవలం 119.57 మాత్రమే.
సంజూ శాంసన్ (కెరీర్ స్ట్రైక్ రేట్ 155), తిలక్ వర్మ (కెరీర్ స్ట్రైక్ రేట్ 143) ఇద్దరూ కూడా భారీ హిట్టర్లే. ఇటీవలి టీ20 వరల్డ్ కప్‌లోనూ వీరిద్దరూ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అలరించారు. అయితే కెప్టెన్ మారిన వెంటనే గత మూడు మ్యాచ్‌లుగా వీరిద్దరి బ్యాటింగ్ తీరు మారిపోయింది. అటాకింగ్ గేమ్ కాకుండా.. డిఫెన్సివ్ మోడ్‌లో ఆడడం ఫ్యాన్స్‌ను ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే శనివారం (జులై 4న) మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో తుది జట్టులో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. సంజూ శాంసన్ తిరిగి ఫామ్ అందుకోవడంతో పాటు తిలక్ వర్మ తన స్ట్రైక్ రేట్‌ను మెరుగుపరుచుకోవాల్సి ఉంది. లేదంటే వీరిద్దరిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్లో అదరగొట్టిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. వైభవ్‌కు అవకాశం ఇవ్వాలని అన్ని వైపులా నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అదేవిధంగా తిలక్ వర్మ స్థానంలో ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గేను బరిలోకి దించేందుకు మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. వచ్చే మ్యాచ్‌ల్లోనైనా ఈ ఇద్దరు హిట్టర్లు పాత ఫామ్‌ను అందిపుచ్చుకుంటారో లేదో చూడాలి.