ఇద్దరు నర్సుల సమయస్ఫూర్తి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని గుండెపోటుకు గురైన ఒక వ్యక్తికి ఇద్దరు నర్సులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలో బుధవారం...
ఇద్దరు నర్సుల సమయస్ఫూర్తి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని గుండెపోటుకు గురైన ఒక వ్యక్తికి ఇద్దరు నర్సులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలో బుధవారం చోటుచేసుకుంది. అంగమాలిలోని ఎల్ఎఫ్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న అంజలి బైజు, బెంగళూరులో నర్సింగ్ విద్యార్థిని అయిన ఆర్ద్ర రాజ్ కదులుతున్న బస్సు నుంచి కిందకు దూకి గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేసి, అతడి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించారు.బుధవారం ఉదయం కలడి వంతెన సమీపంలోని ఎంసీ రోడ్డు వద్ద ఈ సంఘటన జరిగింది. ఓక్కల్ సమీపంలోని తన్నిపుళలో లాటరీ దుకాణం నడుపుతున్న సినోజ్.. స్వయంగా కారు నడుపుకుంటూ ఆసుపత్రికి వెళ్తుండగా తీవ్రమైన ఛాతీ నొప్పికి గురయ్యాడు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో అతను కారులోనే కుప్పకూలిపోయాడు. కేఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నర్సులు రోడ్డు పక్కన జరుగుతున్న గందరగోళాన్ని గమనించారు. వారు వెంటనే బస్సు దిగి, కారు వద్దకు పరుగెత్తి కార్డియోపల్మోనరీ రీససిటేషన్ (CPR) ప్రారంభించారు.సినోజ్ అంగమాలిలోని ఆసుపత్రికి చేరుకునే వరకు ఆ ఇద్దరూ వాహనంలోనే CPR కొనసాగించారు. అతను ఆసుపత్రికి చేరుకునే సమయానికి కోలుకుంటున్న సంకేతాలు కనిపించాయని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో జరిపిన పరీక్షలో కరోనరీ ఆర్టరీ మూసుకుపోయినట్లు తేలడంతో అతడికి అత్యవసర యాంజియోప్లాస్టీ చేశారు. తదుపరి చికిత్స కోసం అతడ్ని మరో ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది.స్థానికుల సహకారం కూడా తోడవడంతో అతడి ప్రాణాలు నిలబడ్డాయి. సినోజ్ ఛాతీ నొప్పితో ఆసుపత్రికి వెళ్తున్నాడని తెలుసుకున్న ఒకకు కారు నడపగా, మరికొందరు ట్రాఫిక్ నుంచి వాహనం బయటకు తీసి అంబులెన్స్‌ను ఏర్పాటు చేయడంలో సహకారం అందించారు.