
ఇంటర్నెట్‌డెస్క్: పుణెలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (Ketan Agarwal Murder Case)ను లోహగడ్ కోటపై నుంచి ఎవరు నెట్టేశారో అనే దానిపై స్పష్టమైన ఆధారాల్లేవని పోలీసులు కోర్టుకు వెల్లడించారు.
ఈ కేసులో కీలక నిందితురాలైన సియా గోయల్ ( Siya Goyal)కు లై-డిటెక్టర్ (పాలిగ్రాఫ్) పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఇప్పటికే సియా, ఆమె ప్రియుడు చేతన్ వాంగ్మూలాలను నమోదు చేసుకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు ముందుకు వెళ్లాలంటే పాలిగ్రాఫ్ పరీక్ష అవసరమని వెల్లడించారు. దర్యాప్తునకు తాజా ఆధారాలను అందించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఏదైనా కేసులో ప్రాథమిక ఆధారాలు బలహీనంగా ఉన్న సమయంలో దర్యాప్తు బృందాలు పాలిగ్రాఫ్ పరీక్షలకు అనుమతి కోరతాయి. వాస్తవానికి వీటి ఫలితాలు కోర్టులో చెల్లవు. కేవలం దర్యాప్తు బృందాలకు సహకరించేందుకే కోర్టులు వీటికి అనుమతి ఇస్తాయి. ఈ కేసులో ఇప్పటికే సియా, చేతన్‌ను లోహగడ్ కోట వద్దకు తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ చేశారు. తాజాగా సహనిందితుడు చేతన్ నడకను విశ్లేషించేందుకు గెయిట్ అనాలసిస్ కూడా చేస్తున్నారు.
కేతన్ నుంచి రూ.కోటి తీసుకొని ప్రియుడికి ఇచ్చిన సియా..!
కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే.. చేతన్‌తో కలిసి ఈ నేరానికి పాల్పడ్డానని సియా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె ఫోన్ ఎప్పుడూ బిజీ వచ్చేదని, చేతన్ పేరును తరచూ ప్రస్తావించేదని కేతన్ కుటుంబ సభ్యులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘‘వారి బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే మా కుమారుడిని హత్య చేశారు’’ అని గత నెల 23న కేతన్ తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సియా, చేతన్‌పై కేసు నమోదు చేశారు. గతంలో నిందితులిద్దరూ క్రికెట్ మ్యాచ్‌కు హాజరైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సియా సోదరుడి ద్వారానే ఆ ఇద్దరికీ పరిచయం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు.
కేతన్ అగర్వాల్ హత్యకు ముందు.. కోటపై నుంచి తోసేయడానికి నిందితులు రిహార్సల్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. దీంతో నేడు సియాను రిహార్సల్ చేసిన ప్రదేశాన్ని గుర్తించేందుకు తీసుకెళ్లారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.