
జూలూరుపాడు, జూలై 02 : రైతులకు ఇబ్బందికరంగా మారిన మొబైల్ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా బస్తాల కొరత లేకుండా సకాలంలో పంపిణీ చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం...
జూలూరుపాడు, జూలై 02 : రైతులకు ఇబ్బందికరంగా మారిన మొబైల్ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా బస్తాల కొరత లేకుండా సకాలంలో పంపిణీ చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఏఐయూకేఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తాసీల్దార్ శ్రీనివాస్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బానోతు ధర్మ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూములకు పట్టాలు లేని సామాన్య రైతులకు, కౌలు రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే యూరియా, డీఏపీ తదితర ఎరువులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాలని, అడ్డగోలుగా పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలను తక్షణమే తగ్గించి రైతులకు ఊరట కలిగించాలని కోరారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతదేశాన్ని ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దామని గొప్పలు చెప్పడం తప్ప, క్షేత్రస్థాయిలో అన్నదాతల అవస్థలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత 12 ఏళ్ల బీజేపీ పాలనలో పూర్తిగా కార్పొరేట్ శక్తులకు, గ్రామీణ సంపన్న వర్గాలకే మేలు చేకూరుస్తూ, రైతుల నడ్డి విరిచే విధానాలను అవలంబిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ ఉత్పాదక వ్యయం రోజురోజుకూ పెరిగిపోవడంతో సాగు పెట్టుబడులు భారమై రైతులు అప్పులపాలవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన యూరియా మొబైల్ యాప్ వల్ల సామాన్య, నిరక్షరాస్య రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ రైతులకు స్మార్ట్ఫోన్లు లేవని, ఒకవేళ ఉన్నా వాటిని సాంకేతికంగా ఉపయోగించడం తెలియడం లేదని అన్నారు. దీనికి తోడు పల్లెల్లో సిగ్నల్ సమస్యలు తోడవ్వడంతో యాప్ సకాలంలో పని చేయక, యూరియా దొరకక రైతులు సాగు సమయంలో అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికత పేరుతో రైతులను ఇక్కట్ల పాలు చేయడం తగదని, తక్షణమే ఈ యాప్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐయూకేఎస్ మండల నాయకులు లింగాల వీరభద్రం, గుగులోత్ సేవియా, ఇరుప రాములు, కల్తి నాగేశ్వరరావు, లింగ, బాబురావు, నవీన్, స్థానిక రైతులు పాల్గొన్నారు.