
భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటన ఖరారైంది. దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడనుంది.
ఆగస్టు 15 నుంచి 27 వరకు జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-2027 సీజన్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం షెడ్యూల్‌ను ప్రకటించింది.షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలె అంతర్జాతీయ స్టేడియంలో తొలి టెస్ట్ జరగనుంది. స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించే గాలె పిచ్‌పై హోరాహోరీ పోరు ఖాయమని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.ఇక రెండో టెస్ట్‌కు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఆగస్టు 23 నుంచి 27 వరకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లు స్థానిక కాలమానం ప్రకారం ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి.ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఈ సిరీస్ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది. భారత జట్టు తొమ్మిది మ్యాచ్‌ల తర్వాత 48.15 విజయాల శాతంతో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 44.44 శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో తమ స్థానాలను మెరుగుపరుచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.భారత్ చివరిసారిగా 2017లో విరాట్ కోహ్లీ సారథ్యంలో శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడింది. ఆ పర్యటనలో టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి చారిత్రక విజయాన్ని అందుకుంది.