EPS 2026 New Rules: ఉద్యోగుల పెన్షన్ విధానంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. దశాబ్దాల కాలం నాటి పాత ఈపీఎస్ 1995, ఈపీఎఎస్ 1971 పథకాల స్థానంలో కొత్తగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్...
EPS 2026 New Rules: ఉద్యోగుల పెన్షన్ విధానంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. దశాబ్దాల కాలం నాటి పాత ఈపీఎస్ 1995, ఈపీఎఎస్ 1971 పథకాల స్థానంలో కొత్తగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) 2026ను అమలులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఉద్యోగుల కనీస పెన్షన్ పరిమితి రూ.1000 పెరిగిందా? నెలవారీ పెన్షన్ లెక్కించే ఫార్మూలాలో ఏదైనా మార్పు చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర కార్మిక మత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం కొత్త పథకంలో మార్పిన రూల్స్ ఏంటి? మారని రూల్స్ ఏంటి? ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. 2014, సెప్టెంబర్ నుంచి ఈపీఎస్ పథకం ద్వారా అందించే పెన్షన్ రూ.1000గానే కొనసాగిస్తున్నారు. ఈ కనీస పెన్షన్ పెంచాలని ఉద్యోగులు దశాబ్ద కాలానికిపైగా డిమాండ్ చేస్తున్నారు. రూ.1000 నుంచి రూ.7500లకు పెంచాలని కోరుతున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుతం ఇస్తున్న రూ.1000 పెన్షన్ కనీసం మందులకు సైతం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు కొత్త పెన్షన్ స్కీమ్ అమలులోకి వచ్చిన క్రమంలో కనీస పెన్షన్ పెంచారేమోనని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, కేంద్రం ఈసారి కూడా వారికి మొండి చేయే చూపించింది. ఈపీఎస్ 2026 పథకంలోనూ కనీస పెన్షన్ రూ.1000గానే కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) 2026లోనూ ఉద్యోగుల నెలవారీ కనీస పెన్షన్‌ను కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. ఈ కొత్త స్కీమ్‌లో సైతం పాత పెన్షన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.1000గా ఉంది. ఈ పింఛను 2014, సెప్టెంబర్ 1 నుంచి స్థిరంగా కొనసాగుతోంది. అలాగే ఈపీఎస్ పెన్షన్ లెక్కింపు ఫార్ములాలోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. పాత సూత్రం ప్రకారమే ఈ కొత్త స్కీమ్‌లోనూ పెన్షన్ లెక్కించనున్నారు. ఈపీఎస్ పెన్షన్ = (పెన్షన్ వర్తించే శాలరీ X సర్వీసు కాలు)/70ఉద్యోగ విరమణ చేసే ముందు చివరి 60 నెలల యావరేజ్ శాలరీని బేస్ చేసుకుని లెక్కిస్తారు. మరోవైపు కొత్త పెన్షన్ పథకం అనేది ఈపీఎఫ్ స్కీమ్ 2026 సభ్యులై ఉండి వేతనం నిర్దేశిత పరిమితికి ఉన్నవారికి వర్తిస్తుంది. అలాగే ఈపీఎస్ 1995, ఈపీఎస్ 1971లో సభ్యులైన వారందరికీ ఈ కొత్త స్కీమ్ సైతం వర్తిస్తుంది. ప్రస్తుత సభ్యులు తమ రిటైర్మెంట్ వరకు ఈ కొత్త స్కీమ్ కొనసాగనుంది. దీంతో పాటు కొత్త రూల్ ప్రకారం పెన్షన్ క్లెయిమ్ కేవలం 20 రోజుల్లోగా సెటిల్ కానుంది. ఒక వేళ ఈపీఎఫ్ఓ ఆలస్యం చేస్తే ఉద్యోగికి 12 శాతం వడ్డీతో కలిపి అధికారి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పాత స్కీమ్స్ ద్వారా పెన్షన్ పొందుతుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. వారి పెన్షన్లు యథావిధిగా కొనసాగుతాయి. 10 ఏళ్ల కంటే తక్కువ సర్వీసు ఉన్నవారు ఎప్పటిలాగే విత్ డ్రా చేసుకోవచ్చు.