మెడ వెనక భాగం, చంకలు, తొడల సందులు(గజ్జలు), మోచేతులు, మోకాళ్లు, చేతి వేళ్లు, కీళ్లపై నల్లటి మచ్చలు చాలా మందికి కనిపిస్తాయి. దీనిని కేవలం మురికి అని చాలా మంది భావిస్తారు.
అయితే, అది ఆకాంతోసిస్ నైగ్రికన్స్. ఇది ఒక చర్మ సమస్య. దీని వల్ల చర్మంపై నల్లటి, మందపాటి, వెల్వెట్ లాంటి మచ్చలు లేదా చారలు ఏర్పడతాయి. చాలా మంది చెమట, మురికి వల్ల ఈ నలుపు ఏర్పడిందని భావిస్తారు. ఇది ఎవరికైనా అంటుకునే వ్యాధి మాత్రం కాదు. అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది కాదు. కానీ ఇది మీ బాడీలో అంతర్గతంగా ఉన్న ఏదైనా ఆరోగ్య సమస్యకు ఓ ముందస్తు వార్నింగ్ కావచ్చు. ముఖ్యంగా శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించకోలేకపోతుందనడానికి ఇది ప్రధాన సంకేతం. దీనినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఆకాంతోసిస్ నైగ్రికన్స్కి గల కారణాలు, లక్షణాలు, పాటించాల్సిన చిట్కాలు గురించి డాక్టర్ షిరీన్ ఫుర్టాడో (సీనియర్ కన్సల్టెంట్ - మెడికల్ & కాస్మెటిక్ డెర్మటాలజీ, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, బెంగళూరు) వివరించారు.ఆకాంతోసిస్ నైగ్రికన్స్ కారణాలు అధిక బరువు లేదా ఊబకాయం: ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఇన్సులిన్ పనితీరు మందగిస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ & డయాబెటిస్: షుగర్ వ్యాధి రావడానికి ముందు (ప్రీ-డయాబెటిస్) లేదా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత: మహిళల్లో వచ్చే పిసిఒఎస్ (PCOS - పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్), థైరాయిడ్ సమస్యల వల్ల రావచ్చు. మందుల ప్రభావం: ఎక్కువ కాలం స్టెరాయిడ్స్ వాడటం లేదా హార్మోన్ల మాత్రలు వేసుకోవడం వల్ల ఈ సమస్య రావచ్చు. క్యాన్సర్ (చాలా అరుదుగా): ఈ నల్లటి మచ్చలు అకస్మాత్తుగా వచ్చి, చాలా వేగంగా వ్యాపిస్తే, అది లోపల ఏదైనా క్యాన్సర్ (ముఖ్యంగా పొట్టకు సంబంధించింది) ఉందనడానికి సంకేతం కావచ్చు.లక్షణాలు ఎలా ఉంటాయి? చర్మం చుట్టుపక్కల ప్రాంతం కంటే నల్లగా మారుతుంది. తాకినప్పుడు లావుగా, గరుకుగా అనిపిస్తుంది. చర్మం ముడతల మధ్య చెమట, మృతకణాలు పేరుకుపోవడం వల్ల కొన్నిసార్లు దురద పెట్టొచ్చు లేదా దుర్వాసన రావచ్చు.దీని నుంచి రిలీఫ్ ఎలా పొందాలి? కేవలం చర్మాన్ని తెల్లగా చేసే క్రీములు రాస్తే ఇది తగ్గదు. దీనికి కారణమైన అంతర్గత ఆరోగ్య సమస్యను నయం చేయడమే మొదటి అడుగు.జీవనశైలి, ఆహారంలో మార్పులు: బరువు తగ్గడం: ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ సమస్య వస్తే, బరువు తగ్గడం ద్వారా కొన్ని నెలల్లోనే ఈ నల్లటి మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. మంచి ఆహారం: కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పులు, హెల్తీ ఫ్యాట్స్ (మంచి కొవ్వులు) ఎక్కువగా తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్, స్వీట్లు, మైదా, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వ్యాయామం: వారానికి కనీసం 150 నిమిషాల పాటు సాధారణ వ్యాయామం (వాకింగ్, రన్నింగ్ వంటివి) లేదా వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను బాగా గ్రహిస్తుంది.వైద్యుల సలహా, మందులు డాక్టర్లు మీ బ్లడ్ షుగర్, ఇన్సులిన్ లెవెల్స్ లేదా హార్మోన్ టెస్టులు చేసి తగిన మందులు సూచిస్తారు. చర్మాన్ని మృదువుగా చేయడానికి మరియు నలుపును తగ్గించడానికి రెటినాయిడ్స్, యూరియా, లేదా శాలిసిలిక్ యాసిడ్ (Salicylic acid) ఉన్న క్రీములను డాక్టర్ల సలహాతో వాడొచ్చు.చర్మంపై గట్టిగా రుద్దడం, బ్లీచింగ్ చేయడం లేదా ఇంటి చిట్కాలు ట్రై చేయకూడదు. దీనివల్ల చర్మం మరింత పాడై నలుపు ఎక్కువవుతుంది. చర్మం ముడతలు పడే భాగాల్ని ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి.ముఖ్యమైన విషయాలు గ్లైసిమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉన్న ఆహారం: పాలిష్ పట్టని బియ్యం (బ్రౌన్ రైస్), జొన్నలు, రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలు మీ డైట్లో చేర్చుకోండి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా చూస్తాయి. పిగ్మెంటేషన్, ఆకాంతోసిస్ మధ్య తేడా: సాధారణ ఎండ వల్ల వచ్చే నలుపు (ట్యాన్) లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల నలుపు వేరు, ఈ నలుపు వేరు. ఇది చర్మం వెల్వెట్ లాగా లావుగా మారడాన్ని బట్టి సులభంగా గుర్తుపటొచ్చు. ఎప్పుడు అలర్ట్ అవ్వాలి?: మీరు లావుగా లేకపోయినా, అకస్మాత్తుగా ఒంటి బరువు తగ్గుతున్నా.. ఈ నల్లటి మచ్చలు చాలా వేగంగా ఒళ్లంతా వ్యాపిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పెద్ద డాక్టర్‌ను సంప్రదించి స్క్రీనింగ్ చేయించుకోవాలి.సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులుడాక్టర్ షిరీన్ ఫుర్టాడో సీనియర్ కన్సల్టెంట్ - మెడికల్ & కాస్మెటిక్ డెర్మటాలజీ, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, బెంగళూరు