
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ ఆతిథ్యమిస్తున్న మూడు దేశాలూ నాకౌట్లో ముందడుగు వేశాయి. రౌండ్ 32లో ఇప్పటికే మెక్సికో, కెనడా గెలిచిన సంగతి తెలిసిందే.
తాజాగా అమెరికా కూడా విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. అమెరికా 2-0 తేడాతో బోస్నియాను చిత్తు చేసింది. అమెరికా ఆటగాళ్లు ఫోలరిన్ బాలోగన్ (45వ నిమిషం), మాలిక్ టిల్మన్ (82వ నిమిషం) గోల్స్ సాధించారు. బోస్నియా నుంచి గోల్ పోస్టు వైపు టార్గెట్ చేసినా అమెరికా గోల్‌కీపర్ అద్భుతంగా ఆపేశాడు. ఈ మ్యాచ్‌లో 64వ నిమిషంలో ఫోలరిన్ రెడ్‌కార్డ్‌ను ఎదుర్కొన్నాడు. అక్కడ్నుంచి యూఎస్ఏ పది మందితోనే ఆడింది. అయినా, బోస్నియా గోల్స్ సాధించడంలో విఫలమైంది. ఇక అమెరికా 24 ఏళ్ల కిందట నాకౌట్లో విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ ఆ నిరీక్షణకు తెరదించింది. రౌండ్16లో జులై 6న అమెరికా.. బెల్జియంతో తలపడనుంది.
హోరాహోరీగా సాగిన పోరులో సెనెగల్పై బెల్జియం విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఆట ఆరంభం నుంచి సెనెగల్దే ఆధిపత్యం. 24వ నిమిషంలోనే హబిబ్ గోల్ కొట్టి ఈ జట్టుకు 1-0 లీడ్ ఇచ్చాడు. ఇస్మాయిలా 51 నిమిషంలో చేసిన గోల్‌తో జట్టు 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక మ్యాచ్‌లో సెనెగల్దే విజయమని అంతా భావించారు. కానీ తర్వాత బెల్జియం ఆటగాళ్లు పుంజుకొన్న తీరు అద్భుతం. రొమేలు లుకాకు (86వ నిమిషం), యౌరి టీలెమన్స్ (89వ నిమిషం) గోల్స్‌తో ఇరు జట్ల స్కోర్ 2-2తో సమమైంది. దీంతో ఉత్కంఠ పెరిగింది. ఆట అదనపు సమయానికి వెళ్లింది. అక్కడా ఎవరూ పట్టువదల్లేదు. అయితే, బెల్జియం జట్టుకు పెనాల్టీ కిక్ రావడంతో యౌరి టీలెమన్స్ (120+5వ నిమిషం) దానిని గోల్‌గా మలిచి సెనెగల్ ఆశలపై నీళ్లుజల్లాడు. చివరికి బెల్జియం 3-2 తేడాతో విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లో అడుగు పెట్టింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.