
తిరుమలలో పండగ వాతావరణం నెలకొంది. పదవీ విరమణ పొందుతున్న పలువురు ఉద్యోగులను సన్మానించారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, రిటైర్మెంట్ రోజునే ఉద్యోగులకు అన్ని బెనిఫిట్స్ అందేలా...
తిరుమలలో పండగ వాతావరణం నెలకొంది. పదవీ విరమణ పొందుతున్న పలువురు ఉద్యోగులను సన్మానించారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, రిటైర్మెంట్ రోజునే ఉద్యోగులకు అన్ని బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తిరుమల తిరుపతి దేవస్థానంలో సందడి నెలకొంది. టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఆనంద రాజు ఆధ్వర్యంలో, టీటీడీ ఈవో జ్యోతి ప్రజ్వలన చేసి 122 మంది రిటైర్డ్ ఉద్యోగులకు సామూహిక సన్మానం చేశారు.
మంగళవారం మహతి ఆడిటోరియంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, సుదీర్ఘ కాలం పాటు టీటీడీకి సేవలు అందించి పదవీ విరమణ పొందుతున్న వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందేలా చూడాలని పేర్కొన్నారు.
అంతేకాకుండా, వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి రిటైర్ అయిన ఉద్యోగులకు, వారు పదవీ విరమణ చేసిన రోజే వారి ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.
ప్రతిరోజూ సరాసరి 75 వేల మందికి పైగా భక్తులకు సేవలు అందిస్తున్న ఉద్యోగులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జేఈవో డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ, జూన్ 30వ తేదీన పదవీ విరమణ పొందిన 122 మంది టీటీడీ ఉద్యోగులను పండగ వాతావరణంలో సన్మానించామని, టీటీడీ ఈవో ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
రిటైర్ అయిన ఈ టీటీడీ ఉద్యోగులను శ్రీవారి లడ్డు, అమ్మవారి కుంకుమ, పసుపు, రవిక, అక్షింతలు, తీర్థం, శాలువాతో సత్కరించారు. దీనితో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులను నేరుగా వారి ఇళ్లకు చేర్చేందుకు వాహనాలను కూడా ఏర్పాటు చేశారు.
వేడుకగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు ,వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.