
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Vizag Road Accident: ఒక కుటుంబంలో ఆర్టీసీ బస్సు తీవ్ర విషాదం నింపింది. నిర్లక్ష్యం కారణంగా ఇద్దరి ప్రాణాలను ఆర్టీసీ బస్సు బలిగొన్నది. కుటుంబంలో అన్నదమ్ముళ్లుగా ఉన్న ఆ ఇద్దరు సోదరులు మరణంలోనూ రక్త సంబంధం వీడలేదు. బస్సు రూపంలో మృత్యువు కబళించడంతో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని విశాఖపట్టణంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన ఒక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్టణం అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన పొట్నూరు రమేశ్, పొట్నూరు సతీశ్ సోదరులు. వీరిద్దరూ బజాజ్, రిలయన్స్ సంస్థల్లో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇద్దరు అన్నదమ్ముళ్లు పని మీద బైక్‌పై బయటకు వచ్చారు. అనకాపల్లి వైపు నుంచి గాజువాక వైపు వస్తున్న సమయంలో శ్రీనగర్ వంతెనపైకి ఎక్కిన సోదరుల బైక్‌ను అత్యంత వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
గాజువాక శ్రీనగర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముళ్లు రమేశ్, సతీశ్ ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న బుల్లెట్ బైక్ ఫుట్‌పాత్‌ను ఢీకొనడంతో ఇద్దరు కిందపడ్డారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలవడంతో ఘటనా స్థలంలోనే వారిద్దరూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రోడ్డు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం విశాఖపట్టణంలోని కేజీహెచ్‌కు తరలించారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరినీ కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగింది. వారి స్వస్థలం అక్కయ్యపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
నిత్యం ప్రమాదాలు అనకాపల్లి-గాజువాక వైపు ఉన్న శ్రీనగర్ వంతెన ఇరుకుగా మారడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. అక్కడ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వాహనాదారులు డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామునే రెండు నిండు ప్రాణాలు రోడ్డు ప్రమాదంలో కోల్పోవడం విషాదం నింపింది. మృతుల కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.