
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Harish Rao vs Revanth Reddy: రైతులకు బాకీపడ్డ రూ.30 వేల కోట్లు ఎప్పుడు ఇస్తావో చెప్పాలని రైతుల పక్షాన రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మిగిలిపోయిన రుణమాఫీ ఎప్పటిలోగా పూర్తి చేస్తావో చెప్పాలని రైతుల పక్షాన నిలదీశారు. 'కేంద్రం కొనుమన్న పంటే కొంటాం, కేంద్రం కొనుమన్న అంతే కొంటాం అని అంటున్న రేవంత్ రెడ్డి మీరు ఉన్నది ఎందుకు. కేంద్రానికి సరెండర్ అయ్యారా? కేంద్రం టార్గెట్ 50 లక్షల మెట్రిక్ టన్నులు. అంతే కొంటే మిగితా రైతుల పరిస్థితి ఏంటి..? వడ్లు కొనే చేతకాని ప్రభుత్వాన్ని రైతులు నమ్ముతారా?' అని ప్రశ్నించారు.
జడ్చర్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల విస్తృత సమావేశం నిర్వహించగా.. మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రసంగం చేశారు. 'కరోనా వచ్చినా కరువు వచ్చినా కేసీఆర్ హయాంలో రైతు బంధు ఆగలేదు. 11 విడతల్లో రూ.73 వేల కోట్లు కేసీఆర్ రైతుబంధు ఇచ్చాడు. రేవంత్ రెడ్డి వచ్చాక వచ్చిన 5 విడతల్లో 3 విడతలు ఎగొట్టాడు. మూడు పంటలకు మూడుసార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు ఇప్పటికే మూడు రైతు బంధులు ఎగ్గొట్టాడు' అని రేవంత్ రెడ్డి మోసాలను బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 2021-2022లో 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని.. దానితో పోల్చుతే మీరుకొన్నది ఎంత? అని రేవంత్ రెడ్డిని తీసిపడేశారు.
'పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. కల్వకుర్తిలో 3 లక్షల 30 వేల ఎకరాలకు నీరు ఇచ్చాం. నెట్టెంపాడుకు లక్ష 60 వేల ఎకరాలకు నీరు ఇచ్చాం, భీమాలో లక్ష 70 వేల ఎకరాలకు నీరు ఇచ్చాం. చెరువులు, కాల్వలు పూర్తి చేసి వలసలను వాపస్ తెచ్చాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చావా?' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు.
'తుంగభద్ర నది మీద శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు రాకుండా 65 టీఎంసీలతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు డ్యాములు కడుతుంటే మన పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏంటి?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. 'ఇంటర్‌లింకింగ్ అఫ్ రివర్స్, ఆల్మట్టి ఎత్తు, అక్రమ ప్రాజెక్టులు తుంగభద్ర, కృష్ణపై కడుతున్న ప్రాజెక్ట్‌లపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా రేవంత్ రెడ్డి నోరు మూసుకున్నాడు' అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడు. తండాలను గ్రామ పంచాయితీలను చేస్తానన్నాడు చేసి చూపించాడు. హైకోర్టు మొట్టికాయలు వేసినా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు. ఫీజు కట్టక పిల్లల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు వారి చదువులు ఆగిపోతున్నాయి' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 'రేవంత్ పాలనలో ఎస్సీ/ఎస్టీలకు అన్యాయం. బీసీలకు అన్యాయం, వృద్ధులకు మోసం, రైతులకు ఢోకా రేవంత్ రెడ్డి మోసం చేయని ఒక్క వర్గం లేదు' అని విమర్శించారు.
'అందాల పోటీలకు వంద కోట్లు ఉంటాయి, ఫ్యూచర్ సిటీకి, నీ మనవడు ఫుట్‌బాల్ ఆటకు, మూసీకి వందల కోట్లు ఉంటాయి. పిల్లల చదువులకు ఉండవా రేవంత్ రెడ్డి. డబ్బులు లేక కాదు ఇవ్వాలనే మనుసు నీకు లేదు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సంగారెడ్డి పాశమైలారం సిగాచీ ఘటనలో 54 మంది చనిపోతే మనిషికి కోటి రూపాయలు ఇస్తానని ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. 'రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2000 చేసిన ఘనత కేసీఆర్. రూ.4000 ఇస్తానన్న రేవంత్ రెడ్డి రూపాయి కూడా పెంచలేదు. ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదు' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గుర్తుచేశారు. ప్రతి కార్యకార్త ఒక సైనికుడి లాగా పోరాడాలని.. ప్రతి గ్రామంలో రేవంత్ చేస్తున్న స్కాంల మీద, తప్పిన మాట మీద చర్చ పెట్టాలని గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 'కొడంగల్‌లో నరేందర్ రెడ్డి చిత్తూ చిత్తుగా ఓడిస్తే పోయి మల్కాజిగిరిలో 5000 ఓట్లతో గెలిచావు. మల్ల నిన్ను ఇక్కడ ఓడించడం ఖాయం. పాలమూరులో 14 సీట్లకు 14 సీట్లను గెలిచి తీరుతాం. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు పూర్తి విశ్వాసం ప్రకటించారు.