
ఇంగ్లాండ్‌తో భారత్ తొలి టీ20 నేడే రాత్రి 10 నుంచి వైభవ్ అరంగేట్రంపై సర్వత్రా ఉత్కంఠ చెస్టర్ లీ స్ట్రీట్ (యూకే) పెద్ద జట్లు.. చిన్న జట్లు అనుకోకుండా ఒక మ్యాచ్‌లో ఓటమి పాలవడం సహజమే.
కానీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడడం మాత్రం అనూహ్యం. టీ20ల్లో వరుసగా రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ఇండియా.. ఐర్లాండ్‌కు సిరీస్ కోల్పోవడం అభిమానులు జీర్ణించుకోలేని విషయమే. ఈ షాక్ తర్వాత ఇంగ్లాండ్ లాంటి బలమైన ప్రత్యర్థితో టీ20 సమరానికి సిద్ధమైంది భారత్. మరి ఈ సిరీస్‌లో భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుంది, ఇందులో అయినా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడతాడా లేదా అన్నది ఆసక్తికరం.
భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు కఠిన పరీక్ష. అతడి సారథ్యంలో ఆడిన తొలి సిరీస్‌లో ఐర్లాండ్ చేతిలో కంగుతిన్న టీమ్ఇండియా.. ఇప్పుడు బలమైన ఇంగ్లాండ్‌ను ఢీకొనబోతోంది. అయిదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ బుధవారం జరగనుంది. 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి వచ్చిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మరోసారి అందరి దృష్టీ నిలిచి ఉంది. ఐర్లాండ్‌తో సిరీస్‌లో అతడిని తుది జట్టులో ఆడించకపోవడం చర్చనీయాంశమైన నేపథ్యంలో జట్టు యాజమాన్యం ఇప్పుడేం చేస్తుందన్నది ఆసక్తికరం. వైభవ్‌ను ఆడించాలంటే ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లలో ఒకరిని పక్కన పెట్టాలి. సంజు స్థానంలోనే వైభవ్ ఆడే అవకాశాలున్నాయి.
జూలు విదిలిస్తారా?: ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓడినంత మాత్రాన టీమ్ఇండియా సత్తాను తక్కువగా అంచనా వేయలేం. ఇంగ్లాండ్‌పై జట్టు భిన్నమైన ఆటతీరును ప్రదర్శిస్తే ఆశ్చర్యమేమీ లేదు. అభిషేక్‌తో పాటుగా వైభవ్ బరిలోకి దిగేట్లయితే.. అగ్నికి ఆయువు తోడైనట్లే. ఇద్దరూ తమదైన శైలిలో చెలరేగితే.. ఇంగ్లిష్ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. వీరికి తోడు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్‌లతో బ్యాటింగ్ లైనప్ కాగితంపై భీకరంగా కనిపిస్తోంది. ఐర్లాండ్ చేతిలో ఓటమి ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యమే కారణం. కాబట్టి బ్యాటర్లు ఇప్పుడైనా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తారేమో చూడాలి. శ్రేయస్ ఈ మ్యాచ్‌లో పెద్ద ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించకపోతే.. తీవ్ర విమర్శలు తప్పవు. ఐర్లాండ్‌పై భారత్ సిరీస్ ఓడినా.. పేసర్లు అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ చక్కటి ప్రదర్శన చేశారు. స్పిన్‌లో మాత్రం భారత్ బలహీనంగా కనిపిస్తోంది. అక్షర్ ఓ మోస్తరు ప్రదర్శన చేస్తున్నాడు. పిచ్‌ను బట్టి మూడో పేసర్‌గా ప్రిన్స్‌ను లేదంటే రెండో స్పెషలిస్టు స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తిని ఆడించే అవకాశముంది.
ఇంగ్లాండ్ బలంగా..: టీ20ల్లో మెరుగైన జట్లలో ఇంగ్లాండ్ ఒకటి. ఆ జట్టుకు ఓపెనర్లే అతి పెద్ద బలం. బట్లర్, సాల్ట్ జోడీ ప్రపంచంలో ఎలాంటి బౌలింగ్‌నైనా తుత్తునియలు చేయగలదు. ఈ ఇద్దరికీ తోడు బ్రూక్, బెతెల్, బాంటన్, జాక్స్, సామ్ కరన్‌లతో ఇంగ్లాండ్‌కు లోతైన బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్‌లో స్పిన్నర్ అడిల్ రషీద్‌తో భారత బ్యాటర్లకు ముప్పు పొంచి ఉంది. డాసన్ కూడా నాణ్యమైన స్పిన్నరే. ఇంగ్లాండ్ పేస్ విభాగం అంత గొప్పగా లేదు.
భారత తుది జట్టు (అంచనా): శాంసన్/వైభవ్, అభిషేక్, ఇషాన్, శ్రేయస్ (కెప్టెన్), తిలక్, సూర్యాంశ్, దూబె, అక్షర్, అర్ష్‌దీప్, హర్షిత్, ప్రిన్స్/వరుణ్.
ఇంగ్లాండ్ తుది జట్టు: సాల్ట్, బట్లర్, బ్రూక్ (కెప్టెన్), బెతెల్, బాంటన్, జాక్స్, సామ్ కరన్, డాసన్, ల్యూక్ వుడ్, సకిబ్ మహమూద్, రషీద్.
ఇంగ్లాండ్‌తో భారత్ ఆడిన టీ20లు. 18 మ్యాచ్‌లు నెగ్గి, 12 ఓడింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.