కర్నూలు జిల్లాలో ఓ రైతు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఏరువాక పౌర్ణమి వేడుకల సందర్భంగా మంత్రాలయంలో ఈ ఘటన జరిగింది. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని కురవ సురేష్ అనే రైతు..
తన ఎద్దులను తుంగభద్ర నదిలో స్నానం చేయించేందుకు తీసుకెళ్లారు. అయితే అనుకోకుండా జరిగిన ప్రమాదంలో కాడెద్దులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాయి. ఇన్ని రోజులు కుటుంబ సభ్యుల్లా చూసుకున్న ఎద్దులను చనిపోవటంతో సురేష్ కుటుంబం విలపిస్తోంది. ఎద్దులను ఇంట్లో వారిలాగా చూసుకున్నామని.. ఇప్పుడు అవి తమను విడిచి వెళ్లిపోయాయంటూ సురేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. కాడెద్దులు చనిపోవటం బాధ కలిగించిందన్న చంద్రబాబు.. ఏరువాక పౌర్ణమి రోజు ఈ ఘటన జరగడం కలిచివేస్తోందంటూ ట్వీట్ చేశారు. సురేష్ కుటుంబానికి సాయంగా నిలవాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. " పశువులను సంపదగా భావిస్తాం. రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేవి కాడెద్దులు. కుటుంబ సభ్యుల్లా భావించే రెండు ఎద్దులు తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తూ చనిపోవడం ఎంతో బాధ కలిగించింది.""అన్నదాతకు పవిత్రమైన రోజైన ఏరువాక పౌర్ణమి నాడు ఇవి మృతి చెందడం, ఆ యజమాని కుటుంబం ఆవేదనతో విలపించడం నన్నెంతో కలిచివేసింది. ఎడ్లు లేని లోటు పూడ్చలేనిదైనప్పటికీ.. వాటి యజమాని అయిన కర్నూలు జిల్లా మంచాలకు చెందిన కురవ సురేష్ కుటుంబానికి ప్రభుత్వం తరపున పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాను. ప్రాణంలా చూసుకునే ఎడ్లను కోల్పోయిన ఆ కుటుంబానికి కొంత సాయంగా నిలవాలని సూచించాను." అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.సాధారణంగా ఎద్దులకు నీటిలో ఈదడం ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు. అయితే చెరువులో ఉన్న ఏవైనా ముళ్ల పొదలు, వలలు వంటివి కాళ్లకు చిక్కుకున్నప్పుడు ఎద్దులు ఈదడం కష్టమవుతుంది. ఈ క్రమంలోనే నీటిలో మునిగి, ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయేందుకు అవకాశాలు ఉన్నాయి. కురవ సురేష్ ఎద్దుల విషయంలోనూ ఇలాగే జరిగి ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జీవనాధారమైన ఎద్దులను కోల్పోయిన ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.