
ఇంటర్నెట్ డెస్క్: అంటార్కిటిక్‌లోని ఎరెబస్ అగ్నిపర్వతం (Mount Erebus).. ఏటా రూ.18.9 కోట్ల విలువైన బంగారం ధూళి గాల్లోకి విరజిమ్ముతున్నట్లు జియోఫిజికల్ పరిశోధనలు వెల్లడించాయి.
1991 నాటి సర్వే ప్రకారం.. రాస్ ద్వీపం సమీపంలో ఉన్న ఎరెబస్ అగ్నిపర్వతం రోజుకు 80 గ్రాముల బంగారు ధూళి (Gold Particles) గాల్లోకి విరజిమ్ముతోంది. ఈ అగ్నిపర్వత లావా నుంచి విడుదలయ్యే వాయువులు స్వచ్ఛమైన బంగారు సూక్ష్మ కణాలను మోసుకెళ్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి అంటార్కిటిక్ మంచుపై స్థిరపడటానికి ముందు 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయని తెలిపారు.
ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ను ఉపయోగించి.. 60 మైక్రోమీటర్ల వరకు వ్యాసం కలిగి ఉండే ఈ బంగారు స్ఫటికాలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. లావాతో పాటు స్వచ్ఛమైన బంగారు సూక్ష్మ స్ఫటికాలను వాతావరణంలోకి ఈ అగ్ని పర్వతం విడుదల చేస్తోందని చెప్పారు. అగ్నిపర్వత వాయువుల (Hot volcanic gases)లో బంగారం దొరకడం పూర్తిగా అసాధారణ విషయమేమీ కాదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. హవాయిలోని కిలావుయా, ఇటలీలోని మౌంట్ ఎట్నా, అలాస్కాలోని ఆగస్టీన్, మెక్సికోలోని ఎల్ చిచోన్ వంటి అగ్నిపర్వతాల వద్ద కూడా స్వల్ప మొత్తంలో బంగారాన్ని గుర్తించామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.