
Venezuelas earthquake | ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలాలో ఇటీవల సంభవించిన జంట భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ విపత్తు జరిగి వారం రోజులు కావొస్తున్నా.. ఇంకా వేలాది మంది జాడ తెలియట్లేదు.
శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది ముమ్మరంగా అన్వేషిస్తున్నారు. ఈ సహాయక చర్యల్లో ఓ జాగిలం అసాధారణమైన సేవలు అందించి హీరోగా నిలిచింది. విపత్తు ప్రతిస్పందన బృందానికి చెందిన ఎనిమిదేళ్ల ‘సునామీ’ తన శిక్షకుడు జార్జ్ బీన్స్‌తో కలిసి 13 మందిని గుర్తించి వారి ప్రాణాలను నిలబెట్టగలిగింది.
ఒకప్పుడు వీధుల్లో అనారోగ్యం, ఆకలితో అలమటించిన ఈ శునకాన్ని ఓ మహిళ చేరదీశారు. అనంతరం దాని తెలివితేటలు గమనించి విపత్తు ప్రతిస్పందన నిర్వహణ సంస్థలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించే నైపుణ్యంపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. 2023లో తుర్కియే, సిరియాల్లో సంభవించిన భూకంపం అనంతరం సహాయక చర్యల్లో.. వెనెజువెలాలో వరదల సమయాల్లోనూ కీలక పాత్ర పోషించింది.
తాజాగా సంభవించిన భూకంపంలో కారాకస్‌లో 8 అంతస్తుల భవనం శిథిలాల కింద చిక్కుకున్న 60 ఏళ్ల వృద్ధుడిని ‘సునామీ’ గుర్తించడంతో రక్షణ బృందాలు విజయవంతంగా ఆ వ్యక్తిని బయటకు తీశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో సునామీ దేశవ్యాప్తంగా హీరోగా నిలిచింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.